తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది.. ఇప్పడికే పలు పార్టీల నేతలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మరింతగా ప్రజల్లోకి వెళ్ళాలని నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్నికల్లో రాజకీయ నేతలు తమతమ గెలుపుపై దృష్టి సారించారు. రోడ్ షోలు, ఇంటింటికి ప్రచారం, బస్తీ సభలు నిర్వహిస్తూ బిజిబిజిగా మారిపోయారు. నియోజకవర్గ ప్రజలకోసం తాము చేసిన, చేయబోతున్న పనులను వివరించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ప్రధాన పార్టీల ఫోకస్ అంతా యువతపైనే ఉంటుంది. దీని కోసం యునివర్సీటిల్లో చదువుతున్న విద్యార్థులను ప్రచారంలో పాల్గోనేలా నేతలు వర్సీటీల విద్యార్థులతో మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో యువత ఓట్లు రాజకీయ పార్టీలపై పెను ప్రభావం చూపనున్నాయని వారు స్ఫష్టం చేస్తున్నారు. అందుకే ప్రతి పార్టీ నేతలు యువతకు ప్రాధాన్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో ఉన్న యునివర్సీటీలు వాటి పరిధిలో ఉన్న కాలేజీల విద్యార్థులను తమ వైపు తిప్పుకునేల విద్యార్థి సంఘాల నాయకులతో పలు పార్టీలకు చెందిన నేతలు తమకు మద్దతు తెలపాలని కోరుతున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు, స్టూడెంట్ లీడర్స్ కీలకపాత్ర పోషించారని.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత రుజువుకావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో యువతను తమ వైపు తిప్పుకునేలా ముఖ్య నేతలు వారికి అఫర్లు ప్రకటిస్తున్నారు. తమ పార్టీ నేతలను గెలిపిస్తే అన్నిరకాలుగా అండగా ఉంటామని వాగ్ధానాలు కూడా చేస్తుండటంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఉస్మానియ, కాకతీయ యూనివర్సీటిలకు చెందిన స్టూడెంట్ లీడర్స్ పలు పార్టీల ప్రచారంలో పాల్గోనేందకు సిద్దం అయ్యారు. తమకు నచ్చిన పార్టీ నేతలకు మద్దతు తెలిపేందుకు పార్లమెంట్ నియోజిక వర్గాల్లో ప్రచారం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలకు మద్దతుగా ప్రచారం చేస్తామంటున్నారు ఓయూ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు. ప్రధాన పార్టీ నేతల కోసం వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పాదయాత్రల తో పాటు డోర్ టూ డోర్ ప్రచారం చేస్తు వారి గెలుపుకోసం కృషి చేస్తామంటున్నారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ నేతలనే గెలుపించేందుకు ప్రచారం చేస్తామని దీంతో పాటు తమకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే వారి కోరకు పని చేస్తామంటున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలు తమను సంప్రదించారని త్వరలోనే వారి తరుపున ప్రచారం చేస్తు యువతను చైతన్య పరుస్తామంటున్నారు ఓయూ విద్యార్థులు, విద్యార్థిసంఘాల నాయకులు. తెలంగాణ రాజకీయ నేతల పట్ల యువత కీలక భూమిక పోషించబోతున్నారు. తమ భావి రాజకీయ నేతను పార్టీని ఎంచుకునేందుకు తమవంతు కృషి చేస్తామంటున్నారు తెలంగాణ యువత. దీంతో యువతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు పార్టీల నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..