Electric bike: కరీంనగర్ కుర్రోడా మజాకా? ఏం ట్యాలెంట్ రా బాబు! ఇంట్లోనే ఈ-బైక్ తయారు చేసేశాడుగా..
ఒక పాత స్ల్పెండర్ బైక్ ను తన వద్ద ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్ తో ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశాడు. ఆ యువకుడు ఎవరూ? అతను చేసిన ప్రయోగం ఏంటి? అతనికి ఎదురైన అనుభవాలు? చివరికి ఏ విధంగా సక్సెస్ సాధించాడు?
ప్రపంచం సరికొత్త ఆవిష్కరణల కోసం ఎదురుచూస్తోంది.. ఒక ఫేస్బుక్.. ఒక ట్విట్టర్.. ఒక వాట్సాప్.. అది ప్రారంభమైనప్పుడు చిన్న అంకురమే. అయినా అవి చూపిన ప్రభావం చాలా ఎక్కువ. ఎంతంటే ఇప్పుడు అవి లేకుండా ప్రపంచాన్ని ఊహించలేనంత. అయితే సాఫ్ట్ వేర్ మాత్రమే ఆవిష్కరణలకు నిలయం అనుకుంటే పొరపాటే. ప్రస్తుత యువత కూడా ఇదే రకం ఆలోచనల్లో ఉంటోంది. సాఫ్ట్ వేర్ రంగం అయితే తమకు నచ్చినట్లు జీవించే అవకాశాన్ని కల్పిస్తోందని అంతా భావిస్తున్నారు. అయితే అందరిలా ఉంటే తన ప్రత్యేకత ఏంటి అనుకున్నాడో ఏమో ఆ యువకుడు.. చిన్ననాటి నుంచి విభిన్నంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నాడు. నిత్యం ఆటోమొబైల్ రంగం పైనే తన మేథోమదనాన్ని సాగించాడు. ఫలితంగా తన ఓ సరికొత్త ఆవిష్కర్తగా అవతరించాడు. ఒక పాత స్ల్పెండర్ బైక్ ను తన వద్ద ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్ తో ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశాడు. ఆ యువకుడు ఎవరూ? అతను చేసిన ప్రయోగం ఏంటి? అతనికి ఎదురైన అనుభవాలు? చివరికి ఏ విధంగా సక్సెస్ సాధించాడు? అన్న అంశాలపై సమగ్ర కథనం మీ కోసం..
కరీంనగర్ కి చెందిన కుర్రాడు..
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన కాసం అఖిల్ రెడ్డి ఏదో ఒక నూతన ఆవిష్కరణ చేయాలని చిన్ననాటి కలలు కనేవాడు. తల్లదండ్రులు కూడా ఆ యువకుడి కలలు సాకారం చేసుకునేలా ప్రోత్సహించారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందాడు. ఆ సమయంలో తన తండ్రి దూరంగా ఉన్న పొలానికి వెళ్లడానికి సైకిల్ తొక్కలేక పడుతున్న ఇబ్బంది.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధనధరల సమస్యలు చూసి.. బ్యాటరీ వాహనం తయారు చేయాలని ప్రణాళిక చేసుకున్నాడు.
పాత హీరో హోండా బైక్ ను..
ఈ క్రమంలో తన కొత్త వాహనం తయారు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బంది అనుకొని తన ఇంట్లోనే మూలనపడి ఉన్న హీరో హోండా స్ప్లెండర్ బైక్ ను తన ఆవిష్కరణకు మూల వస్తువుగా మార్చుకున్నాడు. దానికి 4.8 కిలోవాట్ల మోటరు, కంట్రోలర్, ఓ కన్వర్టర్ తో పాటు స్పీడో మీటర్ నుంచి బిగించి ఎలక్ట్రిక్ బైక్ గా మార్చేశాడు. గరిష్ట వేగం 70 కిలోమీటర్లతో ఈ బైక్ దూసుకెళ్లేలా తయారు చేశాడు.
ఇటీవల ప్రమాదాల నేపథ్యంలో..
ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ పేలుళ్లు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల్ తన బైక్ అధిక వేడిని, మంటను తట్టుకునేలా దానికి కొన్ని పరీక్షలు నిర్వహించారు. అందుకోసం మూడు రోజుల పాటు తన గ్రామానికి సమీపంలో ఉన్న కొండ వద్ద దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఎండలోనే ఉంచాడు. అప్పుడు దానిలో ఉత్పన్నమైన సమస్యలను గుర్తించి కొన్ని మార్పులు చేశాడు. అనంతరం ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో ప్రమాదాలను నివారించడానికి ఒక సర్క్యూట్ బ్రేకర్ ను కనెక్ట్ చేశారు. అలాగే వర్షం, అధిక చలిలో కూడా వాహనాల్లో వస్తున్న మార్పులను గమనించి అవసరమైన మార్పులు చేర్పులు చేశాడు.
18 నెలలుగా పరీక్షలు..
ఈ సందర్భంగా ఈబైక్ సృష్టికర్త అఖిల్ మాట్లాడుతూ తాను తయారు చేసిన ఈ బైక్ పై 18 నెలలుగా వివిధ రకాల పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తుది ఫలితం కోసం ఇంకా రెండేళ్లు వేచి ఉండాలన్నారు. ఆ తర్వాత తన ఉత్పత్తిని మార్కెట్లో ఆవిష్కరిస్తానని చెబుతున్నారు. ఈ బైక్ తయారీ కోసం ఇప్పటి వరకూ రూ. 1.3లక్షలు ఖర్చుచేసినట్లు చెప్పారు. ఈ బైక్ ఐదు గంటల చార్జింగ్ తో 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని వివరించారు. దీనికోసం ఐదు యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుందని చెప్పారు. వినియోగదారులకు అతి తక్కువ ఖర్చుతో పర్యావరణ హిత వాహనం అందివ్వడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..