Telangana: నేటినుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. ఆలయ పునః ప్రారంభం తర్వాత తొలిసారి.. భారీగా ఏర్పాట్లు..
Sri Lakshmi Narasimha swamy Brahmotsavam: నేటి నుంచి యాదిగిరీశుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలు కానున్నాయి. యాదాద్రి ఆలయ పునః ప్రారంభం తర్వాత తొలి బ్రహ్మోత్సవాలివి. దీంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రధానాలయం కొలువుదీరిన తర్వాత జరుగుతోన్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో.. మరింత వైభవంగా చేయడానికి సర్వం సిద్ధం చేశారు. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
కొండకింద భక్తులకు స్వాగతం పలికే ప్రత్యేక తోరణాలు ఏర్పాటు చేశారు. కొండపై మాడవీధులు.. విష్ణు పుష్కరిణి, సప్తరాజ గోపురాలను విద్యుత్ దీపాలంకరళతో అలంకరించారు. చాలా కాలం తర్వాత జరుగుతోన్న బ్రహ్మోత్సవాలు కావడంతో.. దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. ఉత్తర మాడ వీధిలోని తిరుకళ్యాణ మండపాలను ప్రత్యేకంగా రూపొంందించారు.
11 రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలను పాంచరాత్రాగమ రీతిలో నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం నుంచి బ్రహ్మోత్సవ పర్వం ఆవిష్కారం కానుంది. విష్వక్సేన ఆరాధనతో ఆది పూజలు మొదలవుతాయి. అగ్ని ఆరాధన, జల పూజ, శుద్ధి, పుణ్యావచనం తర్వాత రాత్రి అంకురార్పణ.. నిర్వహణకు ఇప్పటికే వేద పండితులు సంసిద్ధమయ్యారు.
అలంకారోత్సవ, వాహనోత్సవాల నిర్వహణకు అలంకార స్వాములు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో.. హైదరాబాద్ లో మొదలైన అఖండ జ్యోతియాత్ర.. యాదాద్రికి నిన్ననే చేరుకుంది. నేటి నుంచి మార్చి మూడో తేదీ వరకూ ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. స్వస్తి పుణ్యావచనంతో ప్రారంభమై.. అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..