Heart Attacks: గుండెకు గండం.. ఈ చిట్టి హృదయానికి ఏమైంది…?
గుండె గుప్పెడంతే. కానీ అది లయబద్ధంగా కొట్టుకున్నంతసేపే ఏ శరీరంలోనైనా ఊపిరి నిలబడేది. ఏ ప్రాణమైనా పదికాలాలపాటు బతికేది. అలాంటి గుండె మొరాయిస్తోంది. ఆస్పత్రికి వెళ్లేదాకా కూడా నిలవడం లేదు ప్రాణాలు. యువతరం కూడా కళ్లెదుటే కుప్పకూలుతోంది. ఆట మైదానాల్లో కూడా గుండె సవ్వడి ఆగిపోతోంది. ఇరవై పాతికేళ్ల వయసులోనే గుండెపోటు ప్రాణాలు తోడేస్తోంది. ఎన్నో సంఘటనలు. గుండెలు పిండేసే విషాదాలు. అసలేమవుతోంది ఈ గుండెకి?

గ్రౌండ్‌లోనే చివరి శ్వాస.. అందరి ముందే గుండెపోటు.. పసిపిల్లలకూ హార్ట్ ఎటాక్స్ వయసుతో సంబంధంలేదు. ఏ అనారోగ్య లక్షణాలు లేకపోయినా.. ఆడుతూపాడుతూ తిరిగేవారిని కూడా గుండెపోటు కాటేస్తోంది. తెలుగురాష్ట్రాల్లో వారంరోజుల వ్యవధిలో జరిగిన ఘటనలు అందరినీ కలవరపెడుతున్నాయి. క్రికెట్ గ్రౌండ్‌లో అప్పటిదాకా చలాకీగా ఉన్న యువకులు క్షణాల్లో ప్రాణాలొదిలారు. అసలేం జరిగిందో అక్కడివారికి అర్ధమయ్యేలోపే ఆ గుండెలు ఆగిపోయాయి. మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ పరిధిలోని రాంపల్లి దాయరలో క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే మరణించాడు 32ఏళ్ల ప్రణీత్. స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో క్రికెట్ అడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. సహచర ఆటగాళ్లు వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణం నిలవలేదు. పల్నాడు జిల్లా వినుకొండలో ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది. 33 ఏళ్ల షేక్ గౌస్‌బాషా అలియాస్ చంటి క్రికెట్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసే గౌస్‌బాషా క్రికెట్ పోటీల్లో ఓ జట్టు తరపున పాల్గొన్నాడు. ఫీల్డింగ్ చేస్తూ బంతి పట్టుకునే క్రమంలో కింద పడి లేచాడు. అలాగే ఆట కొనసాగించాడు. కొద్దిసేపటి తర్వాత ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఫ్రెండ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స చేసినా ఆ గుండె ఆగిపోయింది. మైదానాల్లో చనిపోయిన ఇద్దరూ 33ఏళ్లలోపువారే. శారీరకంగా దృఢంగా ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా సైలెంట్‌గా చంపేస్తున్నాయ్ హార్ట్ స్ట్రోక్స్. రీసెంట్‌గా మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కూడా ఇలాగే గుండెపోటుతో మరణించాడు. ఖమ్మం జిల్లాకు చెందిన...
