Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా వాళ్లే.. మరీ ఆ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు..?

అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు అనుభవించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి ఎదుర్కోవాల్సిన ఈ సీనియర్ నేతలే ఇలా అయితే ఎలా అంటూ పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.

Telangana: పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా వాళ్లే.. మరీ ఆ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు..?
Brs Leaders
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Balaraju Goud

Updated on: Aug 16, 2024 | 10:07 AM

మంత్రులుగా ఉన్నప్పుడు హడావిడి చేసి.. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మాజీలు కొంతమంది ఇప్పుడు చడిచప్పుడు కాకుండా ఉండిపోయారు. ఇది ఎవరు అన్న మాటలు కాదు స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు అంటున్న మాటలు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి అనుభవించిన నేతలు, ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదని ఆ పార్టీ కార్యకర్తలే ఫిర్యాదు చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉండి ప్రభుత్వం మీద విమర్శలు, ఆరోపణలు చేస్తూ ప్రెస్‌మీట్‌లు పెడుతుంటే, ఇంకొంతమంది మాజీ మంత్రులు మాత్రం పట్టిపట్టనట్లుగా అసలు ఎక్కడున్నారో తెలియకుండా కాలం గడుపుతున్నారట.

అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు అనుభవించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి ఎదుర్కోవాల్సిన ఈ సీనియర్ నేతలే ఇలా అయితే ఎలా అంటూ భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. 2014, 2018 రెండు దఫాలుగా మంత్రి పదవి అనుభవించి, అది కూడా నెంబర్ టూ పొజిషన్ అనుభవించిన ఓ మాజీ మంత్రి ఎప్పుడు పెద్దగా ఎక్కడ యాక్టివ్‌గా కనిపించడం లేదట.

ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత చురుగ్గా ఉన్న మంత్రి, ఇప్పుడు కూడా అలాగే ఉంటారనుకున్నారు. అయితే ప్రస్తుతం సైలెంట్‌గా ఉండటం పార్టీలో ఇబ్బందిగా మారిందట. ఇదే గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మరో మాజీ మంత్రి పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లుగా ఉంటున్నారట. అధికార పార్టీకి సంబంధించి దేనిపైనైనా మీడియా రియాక్షన్ అడిగిన ఇప్పుడేమీ మాట్లాడను అంటూ దాటవేస్తున్నారట. గ్రేటర్ లో మాస్ లీడర్‌గా ఉన్న ఈ నేత ఇప్పుడు ఎందుకు క్లాస్‌గా వ్యవహరిస్తున్నారన్నదీ కార్యకర్తలకు అర్థం కావడం లేదట.

ఇక ఉత్తర తెలంగాణకు చెందిన మరో మాజీ అసలు రాజకీయాల్లో ఉన్నారా అనే అనుమానం వచ్చేలా వ్యవహరిస్తున్నారట. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించిన మరో మాజీ మంత్రి ఎన్నికల తర్వాత కనిపించడమే మానేశారట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి, ఇప్పుడు తన కుటుంబానికి మరో టికెట్ దక్కించుకుని ఇద్దరు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు తొడలు కొట్టి రేవంత్ రెడ్డికి సవాలు విసిరిన ఈ మాజీ మంత్రి, ఇప్పుడు మాత్రం నియోజకవర్గంలో దాటి బయటకు రావడం లేదట.

ఇక ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు మాజీ మంత్రులు కేవలం నియోజకవర్గాలకే పరిమితమై, పార్టీతో తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారట. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస గౌడ్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సబిత, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ వీరు మాత్రమే తెలంగాణ భవన్‌కు వస్తూ పోతూ.. పార్టీలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తమ వైఖరిని తెలియజేస్తున్నారు.

ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, అనేక సమస్యలపై జిల్లాల వారీగా అక్కడికక్కడే ప్రభుత్వం నిలదీయండి అంటూ గతంలోనే కేసీఆర్ సీనియర్ లీడర్లు అందరికీ చెప్పారు. అన్నింటికీ తెలంగాణ భవన్ వేదిక కాదు, జిల్లా స్థాయి సమస్యలను జిల్లాకు పార్టీ కార్యాలయాల్లో ప్రెస్‌మీట్ రూపంలో, ఆందోళన కార్యక్రమాల రూపంలో నిరసన తెలుపాలంటూ సూచించారు. కానీ ఈ మాజీ మంత్రులేమో కనీసం కార్యకర్తలకే అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

వీరితోపాటు గత ప్రభుత్వంలో ముఖ్య నేతలుగా ఉన్న వాళ్ళు సైతం సైలెంట్ అయిపోయారు. మీడియా ముందు మౌత్ పీసులుగా తరచూ కనిపించిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు కొంతమంది మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. అధికారంలో ఉంటే పదవులు అనుభవిస్తారు.. అధికారం పోతే అంటి మొట్టనట్టుగా ఉంటారా అన్నట్లుగా కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..