Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ జాతీయ నాయకత్వం వైఖరేంటి..? కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?

తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచిన నిర్ణయంపై బీజేపీ వైఖరి అస్పష్టంగా ఉంది. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నదీ ఇదేనని, బీసీలకు కీడే చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్రం ఈ పెంపును ఆమోదించే అవకాశం తక్కువగా ఉంది.

బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ జాతీయ నాయకత్వం వైఖరేంటి..? కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Telangana Bjp Leaders With Jp Nadda
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Mar 20, 2025 | 9:48 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై భారతీయ జనతా పార్టీ (BJP) వైఖరి వెల్లడించడంతో సమన్వయం లోపించింది. ఇతర వెనుకబడిన తరగతుల (OBC) అభ్యున్నతి, సంక్షేమం విషయంలో మొదటి నుంచి సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్న కమలదళం.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలా.. లేక వ్యతిరేకించాలా.. ఈ రెండూ కాకుండా మధ్యేమార్గంగా తటస్థంగా ఉండాలా అన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేకుండానే అసెంబ్లీలో తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు సమర్థించారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

బీఆర్ఎస్ హయాంలో నాడు అలా..!

గతంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో భారత రాష్ట్ర సమితి (BRS) అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీలను బీసీల జాబితాలో చేర్చడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. జాతీయ నాయకత్వం సైతం తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా స్వయంగా ప్రకటించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ నేతలు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ముస్లింలను బీసీల్లో చేర్చడం ద్వారా బీసీలకు దక్కాల్సిన ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తున్నారని దుయ్యబట్టారు. బీసీలకు జరిగే ఈ అన్యాయాన్ని తాము సహించబోమంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ జాబితాలో ముస్లింలను తొలగించి ప్రతిపాదనలు పంపిస్తే వాటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని బీజేపీ నేతలు అప్పట్లో ప్రకటించారు. అయితే ముస్లిం రిజర్వేషన్ల విషయంలో నాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న వైఖరి అవలంబించడంతో నాటి బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి పంపించిన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన అటకెక్కింది.

కాంగ్రెస్ హయాంలో నేడు ఇలా..!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల గణన జరిపి, బీసీ కులాల లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో ముస్లిం జనాభాలో దాదాపు 80% మందిని బీసీలుగా చూపించడంతో బీజేపీ నేతలు మరోసారి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గతంలో బీఆర్ఎస్, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా మైనారిటీల మెప్పు కోసం బీసీలకు అన్యాయం చేస్తున్నాయంటూ బండి సంజయ్ వంటి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కులగణనతో సరిపెట్టకుండా, ఆ గణాంకాలను ఆధారంగా చేసుకుని బీసీ రిజర్వేషన్ల శాతాన్ని 28-29 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం సైతం చేసింది. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ ఈ రిజర్వేషన్ల పెంపు అమలవుతుందని, ఇదొక విప్లవాత్మక నిర్ణయమని ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. అగ్రవర్ణాలకు చెందిన నేతలైన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బీసీల కోసం ఇంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే, తాను బీసీని అని చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రిజర్వేషన్ల పెంపును పార్లమెంటులో ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.

మేలు కంటే కీడే ఎక్కువ..!

భారతీయ జనతా పార్టీ రాజకీయంగా మాత్రమే కాదు.. విధానపరంగానూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ‘మతం’ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ వాదన. రిజర్వేషన్లు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ అసమానతల ఆధారంగా కల్పించారని, సామాజిక అసమానతలకు ‘కుల వివక్ష’ ఒక కారణమని విశ్లేషిస్తున్నారు. సాంకేతికంగా ‘కులం’ అన్నదే లేని మతంలో కుల ఆధారిత రిజర్వేషన్లు ఎలా ఇస్తారన్నది కమలదళం నేతల ప్రశ్న. ముస్లింలలో ఆర్థికంగా, విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబాటు ఉన్నప్పటికీ.. కుల వివక్ష, సామాజిక అసమానతలు ఉండవని.. అలాంటప్పుడు “కులం” ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదన్నది వారి వాదన. రిజర్వేషన్ల ఫలాలు అందుకోలేని అగ్రవర్ణాల కోసం “ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (EWS)” పేరుతో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలు, రిజర్వేషన్ ఫలాలు అందుకోలేకపోతున్న వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని తమ ప్రభుత్వమే ఇచ్చిందని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. కానీ మైనారిటీ ఓట్ల మెప్పు కోసం ఆ వర్గాలకు చెందినవారిని బీసీల జాబితాలో చేర్చి బీఆర్ఎస్, కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు బీసీలకు నిజానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయన్నది కమలదళం నేతల వాదన.

బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి చురకలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానం విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ అగ్రనాయకత్వం అసహనం వ్యక్తం చేసింది. పార్టీ వైఖరి ఏంటో తెలుసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం తగదని కాస్త గట్టిగా క్లాస్ పీకినట్టు తెలిసింది. కొత్తగా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన మల్క కొమురయ్య, అంజి రెడ్డిలను గురువారం ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వం దగ్గరకు రాష్ట్ర ముఖ్య నేతలు తీసుకెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షులు అమిత్ షాను నేతలు కలిశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశం చర్చకు రాగా.. “బీసీ రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని మాత్రం అడ్డుకోవాల్సిందే” అని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నేతలు బయటికొచ్చిన తర్వాత మీడియాకు వెల్లడించారు.

అమిత్ షా స్పందన, బండి సంజయ్ వంటి నేతలు ముందు నుంచీ చేస్తున్న ప్రకటనలను బట్టి చూస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం తీర్మానించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదించే ప్రసక్తే లేదని అర్థమవుతోంది. ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగిస్తే తప్ప ఈ తీర్మానానికి సైతం మోక్షం లభించే అవకాశం కనిపించడం లేదు..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌