AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadala Srinivas: అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరికి ఇలా అయ్యాడు..! డామిట్ కథ అడ్డం తిరిగింది..!

గడల శ్రీనివాస్.. కరోనా సమయంలో బాగా వినిపించిన పేరు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచిన అధికారి. ఆయనే మాజీ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు. ఆయన రాజకీయ ఆశలు ఆవిరయ్యాయి.

Gadala Srinivas: అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరికి ఇలా అయ్యాడు..! డామిట్ కథ అడ్డం తిరిగింది..!
Gadala Srinivasa Rao
N Narayana Rao
| Edited By: |

Updated on: Aug 02, 2024 | 5:36 PM

Share

గడల శ్రీనివాస్.. కరోనా సమయంలో బాగా వినిపించిన పేరు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచిన అధికారి. ఆయనే మాజీ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు. ఆయన రాజకీయ ఆశలు ఆవిరయ్యాయి. హెల్త్ డైరెక్టర్‌గా ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉండి, కేసీఆర్‌కు పరమభక్తుడిగా, రాజకీయ నేతలా అతిగా రాజకీయ జోక్యం చేసుకున్నాడు. కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని హడావుడి చేశారు. చివరికి టికెట్ రాలేదు. ఆ తర్వాత ఎంపీ టికెట్ పై కర్చీఫ్ వేసినా, ఫలితం దక్కలేదు. సీన్ కట్ చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తన ఉద్యోగంలో కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర స్థాయి అధికారి నుంచి మహబూబాద్ అడిషనల్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా ట్రాన్స్‌ఫర్ చేసింది కొత్త సర్కార్. అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరికి ఇలా అయ్యాడు..!

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్‌గా పని చేసిన గడల శ్రీనివాస్ రావు.. ఒక వెలుగు వెలిగారు. ఉన్నత అధికారి అనే కంటే అప్పటి సీఎం కేసీఆర్‌కు పరమ విధేయుడిగా డ్రామాలు ఆడారు. ఉన్నతాధికారిగా ఉండి కూడా రాజకీయ నేతలా ఈయన గారి హడావుడి మాములుగా ఉండేదీ కాదు..! టైం దొరికితే చాలు, ఆదివారం వచ్చిందంటే కొత్తగూడెంలో వాలిపోయేవారు. జిఎస్ఆర్ ట్రస్టు పేరుతో కొత్తగూడెంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమావేశాలు, సభలు, ర్యాలీలతో హోరెత్తించారు. అవసరం లేకున్నా కేసీఆర్ ను అతిగా పొగడటం.. ఓసారి ఏకంగా ఆయన కాళ్ల మీద పడ్డారు. ఇది అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. అయినా కేసీఆర్ కాళ్ళపై పడటాన్ని ఈయనగారు గట్టిగానే సమర్థించుకున్నారు.

అవకాశం వస్తే.. కొత్తగూడెం ప్రజలకు సేవ చేసుకుని, పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని.. రాజకీయ నేతలాగా సభలు నిర్వహించి ఉపన్యాసాలు ఇచ్చేవారు. బీఆర్ఎస్ తరఫున కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. తాను ఉన్నత స్థాయి అధికారి అనే విషయాన్ని మర్చిపోయారు. రాజకీయ కార్యకలాపాలు, ఒక పార్టీకి అనుకూలంగా నిర్వహించి, మాట్లాడే వారు. అప్పట్లో గడల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కేసీఆర్ హ్యాండ్ ఇచ్చాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు కొత్తగూడెం టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే టికెట్ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్రస్ లేకుండా పోయారు. దీంతో కొత్తగూడెం వైపే కన్నెత్తి చూడలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో..వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. వెంటనే ప్లేట్ మార్చి, గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ టికెట్ కూడా రాలేదు. దీంతో గడల రాజకీయ ఆశలు పూర్తిగా ఆవిరి అయ్యాయి. ఇపుడు అతని ఉద్యోగంలోనూ కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా ట్రాన్స్‌ఫర్ చేసింది కొత్త సర్కార్. ఈ మేరకు జూలై 27న ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే గడల శ్రీనివాస్ ప్రస్తుతం లాంగ్ లీవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే రెండుసార్లు వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన తిరిగి ఉద్యోగంలో చేరతారా..? లేదా? ఏమి చేస్తారనే చర్చ జరుగుతోంది. చూడాలి మరీ గడల శ్రీనివాస్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..