Telangana: పొలిటికల్ కరెంట్.. తెలంగాణలో పవర్ ఫుల్ యుద్ధం
తెలంగాణ గట్టు మీద విద్యుత్ అంశం సరికొత్త రగడను రాజేసింది. BRS జమానాలో విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ సర్కారు విచారణ కమిషన్ వేసి సంచలనం రేపితే, మాజీ సీఎం కేసీఆర్ తన వివరణతో మరో సంచలనానికి తెరదీశారు. అటు రేవంత్ సర్కారును, ఇటు విచారణ కమిషన్ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ వేధింపుల్లో భాగమేనంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కేసీఆర్.

తెలంగాణలో పవర్ ఫుల్ యుద్ధం నడుస్తోంది. విద్యుత్ ఒప్పందాలపై విచారణకు వేగవంతం చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వివరణ కోరుతూ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. నేటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో 12పేజీలతో కూడిన ఘాటైన లేఖతో సమాధానం ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత. రాజకీయ కక్షతో ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థలకు సమాధానం ఇచ్చినా ఉపయోగం లేదంటూనే ప్రభుత్వ నిర్ణయాలను తప్పబట్టారు కేసీఆర్.
ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధమన్న మాజీ సీఎం కేసీఆర్.. ఈ విషయం కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి తెలియకపోవడం విచారకరమన్నారు. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించడమే కాకుండా.. మీడియా ముందుకొచ్చి మరీ అవినీతి జరిగిందన్నట్టుగా కమిషన్ వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కమిషన్ వ్వవహరిస్తున్న తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ఘంగా ఉందన్నారు. కమిషన్ ముందుకు వచ్చి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని లేఖలో పేర్కొన్నారు. లేఖలోని అంశాలను పరిగణలోకి తీసుకొని ఎంక్వైయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు కేసీఆర్. కేసీఆర్ వ్యాఖ్యలకు అంతే ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ నేతలు.
విచారణ తీరును బీఆర్ఎస్ తప్పబడుతుంటే.. అసలు ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరిపించాలంటోంది బీజేపీ. పవర్ ప్లాంట్ల నిర్మాణం, చత్తీస్‌ఘడ్‌తో ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయంటోంది కాంగ్రెస్. రాజకీయ కక్ష సాధింపు అంటోంది బీఆర్ఎస్. నిజానిజాలు జనం ముందుంచాలంటోంది బీజేపీ. మొత్తానికి తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ పవర్‌ఫుల్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..