Warangal: అలా ఎలా తొలగిస్తారు..? వరంగల్‌లో కాక రేపుతున్న ఫ్లెక్సీల వార్..
వరంగల్‌లో మళ్లీ ఫ్లెక్సీల రగడ నెలకొంది. బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో వివాదం నెలకొంది.
వరంగల్‌లో ఫ్లెక్సీల రగడ కాక రేపుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పర్యటన సందర్భంగా , స్థానిక బీజేపీ నేతలు పెద్దయెత్తున నగరంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి నోటీసులు గానీ, ఫెనాల్టీగానీ లేకుండానే వరంగల్ మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. ప్రధాన కూడళ్లలోని ఫ్లెక్సీలను తొలగిస్తుండగా, బీజేపీ నేతలు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తున్నారో చెప్పాలంటూ మున్సిపల్ సిబ్బందితో బీజేపీనేతలు వాగ్వాదానికి దిగారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో బీజేపీ నేతలు అక్కడే ధర్నాకు దిగారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామైంది.
వరంగల్ సిటీలోని పలుచోట్ల మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు తొలగించడంపై వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి ఒక రూల్, విపక్షానికి మరో రూల్సా అంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ వచ్చేవరకూ ధర్నా చేస్తామని భీష్మించారు. ఆదివారం సెలవు దినం రోజున కూడా మున్సిపల్ సిబ్బంది, ఫ్లెక్సీలను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరంతా ఎవరికోసం పని చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్లెక్సీలు తొలగించాలని మీకు ఎవరు చెప్పారని నిలదీశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీసేసే హక్కు మున్సిపల్ సిబ్బందికి లేదన్నారు. మున్సిపల్ కమిషనర్ వచ్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు బీజేపీ నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..