AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal Crime News: మహిళా కానిస్టేబుల్‌కు అత్తింటి వరకట్న వేధింపులు.. తట్టుకోలేక ఆత్మహత్య!

ఎవరైనా వేధిస్తే పోలీసోళ్లకు చెప్పుకుంటారు. పోలీసునే వేధిస్తే! అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు తట్టుకోలేక వరంగల్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది..

Warangal Crime News: మహిళా కానిస్టేబుల్‌కు అత్తింటి వరకట్న వేధింపులు.. తట్టుకోలేక ఆత్మహత్య!
Woman Constable Died
Srilakshmi C
|

Updated on: Mar 06, 2023 | 9:31 AM

Share

ఎవరైనా వేధిస్తే పోలీసోళ్లకు చెప్పుకుంటారు. పోలీసునే వేధిస్తే! అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు తట్టుకోలేక వరంగల్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. వరంగల్‌ జిల్లా వడ్డేపల్లికి చెందిన ఎదులాపురం రాజేందర్‌, సుగుణ కుమార్తె మౌనిక. ఎనిమిదేళ్ల వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి అయిన రాజేందర్‌ నర్సమ్మను వివాహం చేసుకున్నారు. కొంత కాలానికి దేశాయిపేట రోడ్డుకు నివాసం మార్చారు. 2014 బ్యాచ్‌కు చెందిన మౌనిక వరంగల్ పట్టణంలోని మహబూబాబాద్​ డీఎస్పీ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తున్నారు. ఏడేళ్ల క్రితం (2015) వేణురావు కాలనీకి చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి శ్రీధర్‌తో వివాహం జరిగింది. వీరికి మౌహక్‌వీర్‌, నిహారిక అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. శ్రీధర్‌ సోదరుడు కృష్ణమూర్తికి సంతానం లేకపోవడంతో నిహారికను దత్తత ఇచ్చారు. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మౌనిక ఎస్సై మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు.

మొదట్లో ఆమె భర్త ఫైనాన్స్ నడుపేవాడు. లక్షలు, లక్షలు సంపాదిస్తాడని చెప్పారు. పెళ్లయిన కొత్తలో బాగానే సంపాదించినా తర్వాత మద్యానికి బానిసయ్యాడు. తరచూ తాగొచ్చి భార్యతో గొడవకు దిగేవాడు. తనను భర్త ఎంత వేధించినా ఆమె మాత్రం బయటకు చెప్పుకునేది కాదు. తల్లిదండ్రులకు చెప్పేది కాదు. ఎంత బాధించినా భర్తే కదా అని ఓర్చుకుంది. ఎప్పటికైనా మారుతాడనుకుంది.

కానీ ఇంతలో మౌనిక ఇంట్లో ఉరి వేసుకుందని ఎంజీఎంకు తీసుకెళ్తున్నామని అత్తింటి వారు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లి తరఫు బంధువులు ఎంజీఎంకు వచ్చేసరికే మౌనిక మృతిచెందారు. భర్త, అత్త, బావ కలిసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి రాజేందర్‌ ఆరోపించారు. హత్యచేసిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మౌనిక భర్త శ్రీధర్‌, అత్త వీరలక్ష్మి, బావ కృష్ణమూర్తిపై వేధింపుల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వడ్డేపల్లికి తరలించారు.  కుటుంబకలహాలు భరించలేని ఆ మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని, మౌనిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె భర్త, అత్త నిత్యం వేధింపులకు గురయ్యేదని తోటి మహిళ కానిస్టేబుళ్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.