AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DCCB Bank: డీసీసీబీ అధికారుల దాష్టీకం.. లోన్ కట్టలేదని, కట్టుబట్టలతో రోడ్డుమీద నిలబెట్టిన సిబ్బంది

కోట్లల్లో ఎగనామం పెట్టి దర్జాగా కార్లలో తిరుగుతున్న వారినేమీ చేయలేని బ్యాంకు అధికారులు సామాన్యులపై మాత్రం ప్రతాపం చూపించారు.

DCCB Bank: డీసీసీబీ అధికారుల దాష్టీకం.. లోన్ కట్టలేదని, కట్టుబట్టలతో రోడ్డుమీద నిలబెట్టిన సిబ్బంది
House Seized
Balaraju Goud
|

Updated on: Jan 22, 2022 | 2:47 PM

Share

DCCB Bank Officials Locked Farmers Houses: కోట్లు ఎగ్గొట్టినోళ్లకు రెడ్‌ కార్పెట్ పరుస్తారు.. బ్యాంకుకు వచ్చిన బడాబాబులకు ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. కోట్లల్లో ఎగనామం పెట్టి దర్జాగా కార్లలో తిరుగుతున్న వారినేమీ చేయలేని బ్యాంకు అధికారులు సామాన్యులపై మాత్రం ప్రతాపం చూపించారు. తీసుకున్న కొద్దిపాటి లోనును గడువులోగా కట్టలేదని నడిరోడ్డున కట్టుబట్టలతో నిలబెట్టారు. పిల్లాపాపలతో సహా బజారుకీడ్చారు. కాస్త టైమియ్యండి సారు.. లోన్‌ కడుతామని బతిమిలాడినా కనికరిచంలేదు.

అసలే కరోనా కాలం.. రెండేళ్లుగా ఉపాధి, ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మొదటి, రెండో వేవ్‌ నుంచి కాస్త కోలుకునేలోపు మూడో వేవ్‌ వచ్చిపడి మరింత కష్టాల్లోకి నెట్టింది. కానీ ఇవేమీ పట్టలేదు ఆ బ్యాంకు అధికారులకు. తమ దగ్గర తీసుకున్న రుణాలను చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. పాపం.. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాలు లోన్లు తిరిగి చెల్లించలేకపోయాయి. ఇంకేముంది.. దయ, కరుణ అనేది మచ్చుకైనా చూపలేదు. నిర్దాక్ష్యిణ్యంగా ఇళ్లకు సీల్‌ వేశారు. లోన్‌ కట్టని కుటుంబాలను పిల్లా, పాపలతో సహా కట్టుబట్టలతో రోడ్డుమీద నిలబెట్టారు.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుద్దేపల్లి సహకార బ్యాంకు 2017-18లో జేఎల్‌జీ గ్రూపునకు రుణాలు మంజూరు చేసింది. గ్రూపు సభ్యుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి 20వేల రూపాయల చొప్పున రుణమిచ్చారు బ్యాంకు అధికారులు. మండలంలోని సుద్దేపల్లి, రామచంద్రాపురం, కోరుట్లగూడెం, బోదులబండకు చెందిన పలు గ్రూపులకు చెందినవారు బ్యాంకు నుంచి రుణాలు పొందారు. ఒక్కో సభ్యుడు 20 వేలకు మించకుండా రుణం తీసుకున్నారు. రుణం మంజూరుకు అధికారులు కమీషన్లు ముట్టనిదే రుణాలివ్వరు. అలాంటిది రుణం సకాలంలో చెల్లించక పోవడంతో రుణ గ్రహీతలపై ప్రతాపం చూపించారు.

పందిరిమీద గుండు పడ్డట్టు అకస్మాత్తుగా వచ్చారు. లోన్‌ కడుతారా చస్తారా అంటూ హుకుం జారీ చేశారు. పేదరికంతో మగ్గుతున్న వారు అప్పటికప్పుడు డబ్బు కట్టలేకపోయారు. రంగంలోకి దిగిన అధికారులు ఇళ్లకు సీల్‌ వేశారు. పిల్లాపాపలను చూసి కూడా కరుణ చూపలేదు. దయాదాక్షిణ్యం లేకుండా రోడ్డుమీద నిలబెట్టారు. కాస్త టైమివ్వండి.. లోన్‌ చెల్లిస్తామని బతిమిలాడినా కనికరించలేదు. పిల్లలను చూసైనా వదిలేయండని సారూ అని కాళ్లావేళ్ల పడ్డా వదల్లేదు. ఇళ్ల నుంచి కట్టుబట్టలతో బయటకు పంపి ఇళ్లను జప్తు చేశారు. ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిలో రోడ్డుమీదే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కోట్లలో అప్పు తీసుకున్నోళ్లను వదిలి.. పేదోళ్లపై ప్రతాపం చూపుతున్నారంటూ బ్యాంకు అధికారులపై భగ్గుమంటున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని ఇళ్ల ఎదుటే పిల్లా జల్లాతో కలిసి ఆందోళనకు దిగారు.

లోన్‌కట్టేందుకు కాస్త టైమివ్వమిని అడిగినా వినకుండా ఇంటిని సీజ్‌ చేసి వెళ్లారు. ఇప్పుడు మేం ఎక్కడ ఉండాలో తెలియడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా టైంలో ఆర్థిక పరిస్థితి బాగోలేక లోన్‌ కట్టలేకపోయాం. డబ్బు కట్టకపోతే జైలు పాలు చేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.

Read Also…  Hyderabad: విడాకుల కోసం వచ్చిన మహిళను ట్రాప్ చేసిన లాయర్.. వీడియోలు తీసి.. శారీరకంగా