Mamnoor Airport: మామూనూరు ఎయిర్‌పోర్టు దగ్గర టెన్షన్.. టెన్షన్.. నిలిచిపోయిన భూసేకరణ సర్వే..
వరంగల్ జిల్లాకు ఎయిర్‌పోర్టు తీసుకొచ్చామని రాజకీయ నేతలు సంబరాలు చేసుకున్నారు. క్రెడిట్ కోసం పార్టీల మధ్య పోటీ కూడా నెలకొంది. అయితే ఎయిర్‌పోర్టు కోసం భూములు కోల్పోయే రైతులు తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కారు. మరోవైపు మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధికి భూములు కోల్పోతున్న రైతులు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు.

మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. మామునూరు ఎయిర్‌పోర్టు రావడం సంతోషకరమే అయినా భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మాములూరుకు సమీపంలో ఉన్న గవిచర్ల క్రాస్ రోడ్డు మీదుగా నక్కలపల్లి, గుంటూరుపల్లి, నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారి మొత్తం ఎయిర్‌పోర్టులో కలిసిపోతుంది. దీంతో రహదారి మూసివేస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎయిర్‌పోర్టు రావడం వల్ల ఎంతైతే లాభపడుతున్నామో.. అంతకంటే ఎక్కువ నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాకపోవడంతో ధర్నాకు దిగినట్లు తెలిపారు. రైతుల ఆందోళనతో మామూనూరు ఎయిర్‌పోర్టు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. భూసేకరణ సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను రైతులు, వారి కుటుంబాలు అడ్డుకున్నాయి. దీంతో భూసేకరణ సర్వే తాత్కాలికంగా నిలిచిపోయింది.
మరోవైపు మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధికి భూములు కోల్పోతున్న రైతులు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన గాడేపల్లి, గుంటూరు పల్లి రైతులతో రేవూరి ప్రకాశ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. భూ సర్వేకు సహకరించాలని, భూమి కోల్పోతున్న రైతులకు ఆమోదయోగ్యమైన పరిహారాన్ని ఇప్పిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్‌పోర్టు నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే సాధ్యమైనంత తొందరగా ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రైతులతో మాట్లాడి వారిని ఒప్పించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
