‘మా అమ్మకు.. నానమ్మ, తాతయ్య అస్సలు నచ్చరు’..! ఎగ్జాంలో ప్రశ్నకు ఓ విద్యార్థి సమాధానం..
క్షమ, సహనం, ప్రేమ కలగలసిన అమృతకలశం లాంటి ఆడవాళ్లు అత్తింటివారి పట్ల రాక్షసులుగా మారుతున్నారు. పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన ప్రతి ఇల్లాలు ఆ ఇంటిని, ఇంటిలోని మనుషులను తన వారిగా భావించి మమతల కోవెలగా తీర్చిదిద్దడానికి బదులు.. స్వార్ధంతో కకావికలం చేస్తున్నారు. ఇదే ఈ తరం చేస్తున్న అతిపెద్ద తప్పు..

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 13: శారీరక, మానసిక బంధాలకు మించింది ప్రేమబంధం. అటువంటి అనురాగపు అనుబంధాలతో పెనవేసుకున్న అందమైన పొదరిల్లు.. ఇళ్లు. అందులో అమ్మా, నాన్నలేకాదు నానమ్మ, తాతయ్య, మామయ్య, అత్తలు, పిన్ని, బాబాయ్.. ఇలా అందరూ ఉండాలి. అదే ఉమ్మడి కుటుంబం. కానీ నేటి కాలంలో ప్రతి ఇళ్లు ఓ నరకంలా మారుతుంది. క్షమ, సహనం, ప్రేమ కలగలసిన అమృతకలశం లాంటి ఆడవాళ్లు అత్తింటివారి పట్ల రాక్షసులుగా మారుతున్నారు. పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన ప్రతి ఇల్లాలు ఆ ఇంటిని, ఇంటిలోని మనుషులను తన వారిగా భావించి మమతల కోవెలగా తీర్చిదిద్దడానికి బదులు.. స్వార్ధంతో కకావికలం చేస్తున్నారు. భార్తను తన మాయమాటలతో వంచించి.. అత్తమామలు జీవితాంతం రెక్కలుముక్కలు చేసుకుని సంపాధించిన ఆస్తిని లాక్కుని వారిని నిర్ధాక్షిణ్యంగా వీధిపాలు చేస్తున్న ఉదంతాలు నిత్యం కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. ఈ మొత్తం దుర్మార్గంలో ఆ ఇంట అడుగుపెట్టిన కోడలిదే ప్రధానపాత్ర అనేది కాదనలేని సత్యం. కానీ తెలుసా.. తమ కళ్లముందే నానమ్మ, తాతయ్యలను అమ్మనాన్నలు ఎలా ట్రీట్ చేస్తున్నారో చూసే వారి పిల్లలు.. పెద్దయ్యాక అవే నేర్చుకుంటారు. అక్షరాలా అవే చేస్తారు. అందుకు ఈ కింది ఉదంతం అక్షరసత్యం.
ఓ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ చిన్నారికి స్కూల్లో పరీక్షలు పెట్టారు. అందులో వచ్చిన ఓ ప్రశ్నకు రాసిన జవాబు చూసినవారు ఎవరైనా ఆలోచనలో పడతారు. ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా ఇంగ్లిష్ పరీక్ష పెట్టారు. ఆ ప్రశ్నపత్రంలో అమ్మకు నచ్చేవి.. నచ్చనివి.. అని ఓ ప్రశ్న వచ్చింది. అందుకు సమాధానంగా చిన్నారి.. అమ్మకు నచ్చనిది ‘నానమ్మ, తాతయ్య’ అని ఇంగ్లిష్‌లో రాసింది. ఇక ఆ చిన్నారి పేపర్ దిద్దిన టీచర్.. పేపర్‌లో రాసిన ఆన్సర్లు చూసి దాదాపు షాకైంది. నేటి సమాజానికి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు, అత్తమామలు భారంగా మారారని, వారి పట్ల ఇంటి కోడల్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో సదరు విద్యార్థి సమాధానం ద్వారా అవగతమవుతుంది.
దీనిని బట్టి చూస్తే మానవ సంబంధాలు, బంధాలు ఎంత మేర తెగిపోయాయో ఈ జవాబే చక్కని ఉదాహరణని సదరు టీచర్ ఆవేదన వ్యక్తం చేస్తూ చిన్నారి ఇంగ్లిష్ పేపర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసి, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ షాకింగ్ ఘటన ఎక్కడో అమెరికాలోనో, లేదంటే చైనాలోనో అనుకుంటే పొరబాటే. అక్షరాలా మన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో వెలుగు చూసింది. ఇకనైనా మారితే రేపటి మీ వృద్ధాప్యం శాపంకాకుండా ఉంటుంది. పెద్దలకు విలువిద్దాం. వారి మాటలను గౌరవిద్దాం. జీవితసారాన్నంతా వారి మాటల్లో కలగలిపి మనకు చెబుతుంటారు. మంచి, చెడులు విడమర్చి మార్గదర్శకులుగా ఉండవల్సిన వారి మాటను పెడచెవిన పెట్టి.. పండుటాకుల్లాంటి పెద్దలను వృద్దాశ్రమాలు, లేదంటే వీధిపాలు చేయటం క్షమించరాని నేరం. దాని పరిణామాలు వేరే జన్మలో రానేరావు. మీ కళ్లముందే అపురూపంగా పెంచుకుంటున్న మీ పిల్లల రూపంలోనే.. ఒడ్డీతో సహా మీరు అనుభవించవల్సి ఉంటుంది. జాగ్రత్త! మీ సంస్కారానికి ఇదొక హెచ్చరిక.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.