Telangana: చెక్‌పోస్ట్ వద్ద లారీని ఆపిన పోలీసులు.. క్యాబిన్‌లో సరుకు ఏం లేదు.. ట్విస్ట్ ఇదే
పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిఘా పెట్టి దాడులతో దడ పుట్టిస్తున్నారు. అయినా.. తెలంగాణను మత్తు జాడ వీడటం లేదు. బడికి పోయే పిల్లాడి నుంచి డిగ్రీ చేస్తున్న యువకుడి దాకా.. మత్తుమందుకు అలవాటు పడుతున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడంతో ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత.. జవసత్వాలు సన్నగిల్లుతున్నాయి. మత్తు చిత్తుతో యుక్త వయసులోనే అనారోగ్యం పాలవుతున్నారు.

కొత్తగూడెం వన్-టౌన్, సిసిఎస్ పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్‌లో శనివారం జిల్లా కేంద్రంలో రూ.3.63 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. శేషగిరినగర్‌లో వాహన తనిఖీల సందర్భంగా 727.36 కిలోల బరువున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా తరలించేందుకు పెడ్లర్లు మంచి స్కెచ్ వేశారు. గంజాయిని లారీ క్యాబిన్, క్యారేజ్ మధ్య ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో దాచిపెట్టారు. అయితే ఈ తరహా స్కెచ్చులపై పక్కా అవగాహన ఉన్న పోలీసులు వారి ఆట కట్టించారు. యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన నిందితులు భూరి సింగ్, కమల్ సింగ్ గురువారం ఏపీలోని చింతూరు మండలం తులసిపాక అడవుల్లో గంజాయిని సేకరించి ఆగ్రాకు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. వీరికి గంజాయి విక్రయించిన కొర్రా సీతారాములు, వంతల విశ్వనాథ్, వి.బాబురావు, కె.చిన్నారావు, కె.సాయిబాబు, కె.శంకర్‌రావు, భద్రి అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు.
గంజాయి లారీని అడ్డగించి నిందితులను అరెస్టు చేసిన వన్-టౌన్ సీఐ కరుణాకర్, ఎస్‌ఐ విజయ, సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ రమాకాంత్, ఎస్‌ఐలు ప్రవీణ్, రామారావు, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
మరో ఘటనలో జిల్లాలోని పాల్వంచ వద్ద రూ.28.80 లక్షల విలువైన 51.27 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారని ఎక్సైజ్ సిఐ ఎస్. రమేష్ తెలిపారు. నిందితులు గంజాయిని ఒడిశాలోని మల్కాన్‌గిరి వద్ద సేకరించి.. మహారాష్ట్రలోని పూణేకు అక్రమంగా రవాణా చేయడానికి యత్నించినట్లు గుర్తించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.