AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ పోస్టులపై ప్రభుత్వం కఠిన చర్యలు 

ఫేక్ వీడియోలు.. ఏఐ ఫోటోలతో ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వం నజర్ పెట్టింది. తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చర్యలకు సిద్ధమైంది. హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రాణభయంతో జింకలు పరుగులు పెడుతున్నట్లు, నెమళ్లు ఏడుస్తున్నట్లు సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. వారిపై యాక్షన్ తీసుకుంటోంది ప్రభుత్వం. 

Hyderabad: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ పోస్టులపై ప్రభుత్వం కఠిన చర్యలు 
Kancha Gachibowli Land Row
Ram Naramaneni
|

Updated on: Apr 13, 2025 | 8:22 PM

Share

ప్రకృతి, పర్యావరణ విధ్వంసం పేరిట ఏఐ ఆధారిత ఫొటోలు, వీడియోలను కొందరు సృష్టిస్తే.. వాటిని నిజమని నమ్మి పలువురు ప్రముఖులతో పాటు వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, చోటా మోటా నాయకులు, పర్యావరణ ప్రేమికులు ఆ ఫొటోలు, వీడియోలను వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీని సైతం తాకింది. అక్కడ కూడా వీటిని రీట్వీట్ చేయడంతో ఇలా నకిలీ ఫొటోలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశాయి. ఇదే విషయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు సైతం స్పష్టం చేశారు.

ఫేక్ ఫొటోలు, వీడియోలు సృష్టించిన వారిపై చర్యలు

ప్రభుత్వానికి డ్యామేజ్ కావడంతో ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారులతో సమావేశమై ఫేక్ ఫొటోలు, వీడియోలను సృష్టించిన వారితో పాటు వాటిని ప్రచారం చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సైబర్ సెక్యూరిటీ అధికారులు రంగంలోకి దిగారు. సోషల్ మీడియాలో పోస్టులపై ఆరా తీస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ వీడియోలను ఎవరు తయారు చేశారనే విషయంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ సహా పలువురికి నోటీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ సహా పలువురు కీలక నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. తనపై నమోదైన నాలుగు ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలంటూ కోర్టుకు వెళ్ళినప్పటికీ క్రిశాంక్‌కు ఉపశమనం కలుగలేదు. విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు 9 గంటలకు పైగా పోలీసులు క్రిశాంక్‌ను విచారించారు. ఏప్రిల్‌ 14న మళ్లీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

ఫేక్ పోస్టులను డిలీట్ చేస్తున్న నెటిజన్లు

మరోవైపు ఇలాంటి పోస్టులు పెట్టిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఇప్పటికే తమ పోస్టులను డిలీట్ చేశారు. వీరిద్దరు పోస్టులను డిలీట్ చేసిన తర్వాత వేలాది మంది నెటిజన్లు ఫేక్ పోస్టులు డిలీట్ చేస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు.

పోస్టులు డిలీట్ చేసినా చర్యలు తప్పవంటున్న పోలీసులు

అయితే పోస్టులు డిలీట్ చేసినా కొందరిపై కేసులు మాత్రం తప్పవంటున్నారు పోలీసులు. చర్యలు తీసుకుంటారనే హెచ్చరికలు ప్రజల్లోకి పంపితే ఇంకోసారి ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫొటోలు పోస్టు చేసే ముందు ఆలోచిస్తారని అధికారులు భావిస్తున్నారు. మరి ఈ కేసులో ఎవరికి ఇంకా ఎంత మందికి నోటీసులు ఇస్తారు.. ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారనేది.. వెయిట్ అండ్ సీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.