Telangana: స్మశానంలో పసిబిడ్డ ఏడుపు శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూడగా
ఏ కన్నతల్లి బిడ్డో తెలియదు..అనాథగా పడి ఉన్నాడు. తల్లి పొత్తిళ్ళ నుంచి బయటకు వచ్చి.. ఈ లోకాన్ని అప్పుడే చూస్తున్నాడు. కొత్తగూడెంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది.? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యూ గొల్లగూడెం స్మశాన వాటిక దగ్గరకు వెళ్ళి చూడగా పసి బాబు ఏడుపులు వినిపించాయి. స్మశానంలో పడి ఉన్న నవజాత మగ శిశువు ఏడుస్తూ కనిపించాడు. రెండు రోజుల క్రితం పుట్టిన నవజాత మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలి వెళ్లారు. అమ్మ కోసం, పాల కోసం గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కొత్తగూడెం స్త్రీ మాత శిశు ఆసుపత్రికి తరలించారు త్రీ టౌన్ పోలీసులు. నవజాతి శిశువు ఎవరన్నది వివరాలు సేకరిస్తున్నారు కొత్తగూడెం పోలీసులు.
అనంతరం పోలీస్ పర్యవేక్షణలో మాతా శిశు కేంద్రానికి తరలించి అక్కడ శిశువును పరీక్షించారు. ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం వారి పర్యవేక్షణలో ఆరోగ్యంగానే ఉంది. ఇటీవల శిశువులను వదిలి పెడుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఆ తల్లికి ఏ కష్టం వచ్చింది. అసలు ఎందుకు కనాలి. ఇలా ఎందుకు అనాథలా పసి పిల్లాడిని పడేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పసి హృదయానికి అమ్మ కోసం, అమ్మ స్పర్శ కోసం ఎన్ని గంటలు నుంచో ఏడ్చి.. ఏడ్చి.. కన్నీళ్లు ఇంకిపోయాయి. కడుపులో ఏమి లేక బిక్క మొహం వేసి.. నన్ను ఎవరు తీసుకువెళతారు.. ఎవరు లాలిస్తారో అన్నట్లు ఎండలో మగ్గిపోతూ అలాగే పడుకున్నాడు. తనకే నడక, మాటలు వచ్చి ఉంటే.. ఇంత కష్టం ఉండేది కాదేమో.. ఆ కన్న తల్లి ఎందుకు ఆలోచించలేదా.?
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..