Telangana: విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. బస్ పాస్ రేట్లు 150 శాతం మేర పెంపు.. ఇవిగో వివరాలు
విద్యార్ధులారా.. ఎంచక్కా ఆర్టీసీ బస్‌లో కాలేజీకి వెళ్లి రావచ్చనుకుంటే, మీ జేబుకు చిల్లు పడినట్టే.. ఎందుకంటే భారీగా బస్ పాస్ చార్జీలు పెరిగాయి. ఎంత దూరానికి ఎంత పెరిగాయో తెలుసుకుందాం పదండి...

students Bus pass fares: రెండు రోజుల క్రితం బస్ చార్జీలు పెంచిన ఆర్టీసీ.. ఇప్పుడు బస్ పాస్‌లపైనా రేట్లు పెంచింది. ఏకంగా 150 శాతం మేర బస్ పాస్ రేట్లు పెరిగాయి. 4కిలోమీటర్ల దూరానికి ఇన్నాళ్లూ 165 రూపాయలు ఉంటే.. ఇకపై 450 రూపాయలు పెడితేనే పాస్ ఇస్తారు. 8కిలోమీటర్ల దూరానికి 200 రూపాయల నుంచి.. 600 రూపాయలకు బస్ పాస్ రేట్ పెరిగింది. ఇప్పటివరకూ 245 ఉన్న రూట్ బస్‌పాస్ ఇప్పుడు 900 రూపాయలు అయింది. 280 ఉన్న బస్‌పాస్‌ను ఇక నుంచి 1150 రూపాయలకు హైక్ చేశారు. 22కిలోమీటర్ల దూరానికి 330 ఉన్న బస్‌పాస్ ఇకపై 1350 రూపాయలు. డీజిల్‌సెస్ పేరుతో నిన్న టికెట్ రేట్లు పెంచిన ఆర్టీసీ ఇప్పుడు బస్‌పాస్‌లపై భారీగా రేట్లు పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు బస్ పాస్ వినియోగిస్తున్నారు. గ్రేటర్ పాసులతో పాటు నగర శివారు వరకే ప్రయాణించే పాసులు కూడా ఉన్నాయి. ప్రతి నెలా విద్యార్థుల బస్ పాసులతో ఆర్టీసీకి 8 కోట్ల రూపాయల అదాయం వస్తుంది. పెరిగిన చార్జీలతో ఇకపై నెలకు 15 కోట్ల రూపాయలు రానుంది. అంటే ఏడాదికి 180 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్(Coronavirus) కారణంగా గత రెండేళ్లుగా కాలేజీలు సరిగా రన్ కాలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితిలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇంకో వారంలో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 15 నుంచి విద్యార్థులకు కొత్త పాస్ లు ఇవ్వనున్నారు. ఈ సమయంలో రేట్లు పెంచడం విద్యార్ధులకు కొంత భారంగా మారింది.




