Telangana: సంక్రాంతి సీజన్.. TSRTCకి కాసుల పంట.. గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన ఆదాయం
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్‌ఆర్టీసీ కుటుంబంలోని ప్రతి ఒక్క సిబ్బందికి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తూ ప్రయాణికులకు వేగవంతమైన సేవలని అందించాలని ఆకాంక్షించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈ నెల 10 నుంచి 20 తేది వరకు.. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్‌ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సుల్లో ప్రయాణించారు. సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా రూ.165.46 కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. గత ఏడాది సంక్రాంతి కంటే ఈ సారి రూ.62.29 కోట్లు ఎక్కువగా రాబడి వచ్చింది.
కిలోమీటర్ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కిలోమీటర్ల మేర టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగింది. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 59.17గా ఉంటే.. ఈ సంక్రాంతికి అది 71.19కి పెరిగింది.
“టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోసారి నిరూపించారు. సాధారణ చార్జీలతోనే 3923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల మా సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది. అంతేకాదు, రద్దీకి అనుగుణంగా మా సిబ్బంది అద్బుతంగా పనిచేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్… సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించిన ప్రజలకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇలానే ఆదరించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఈ స్పందన వల్ల తమ సంస్థపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్థ సిబ్బంది నిబద్దతతో పనిచేశారని, వారి కృషి వల్లే మంచి ఫలితాలు వచ్చాయని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని, అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం మొబైల్ బయోటాయిలెట్లు, తాగునీరు, కుర్చీలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్‌ఆర్టీసీ కుటుంబంలోని ప్రతి ఒక్క సిబ్బందికి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తూ ప్రయాణికులకు వేగవంతమైన సేవలని అందించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా తమ సంస్థకు రవాణా, పోలీస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు సహకరించారని గుర్తుచేశారు. ఆయా విభాగాల సమన్వయంతో పనిచేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. టీఎస్‌ఆర్టీసీకి సహకరించిన రవాణా, పోలీస్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం