Telangana Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లికేషన్లు.. ఫీజు ఎంతో తెలుసా..
అసెంబ్లీ ఎన్నికలకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లికేషన్లు, ఫీజు వసూలు చేసి కొత్త ట్రెండ్‌ను ఈసారి కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.

హైదరాబాద్, ఆగస్టు 16: అసెంబ్లీ ఎన్నికలకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లికేషన్లు, ఫీజు వసూలు చేసి కొత్త ట్రెండ్‌ను ఈసారి కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయింపు ప్రక్రియను పార్టీ మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆహ్వానం పలికింది. ఈ నెల 18 నుంచి 25 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీని కోసం ఫీజు కూడా ఖరారు చేసింది. బీసీ అభ్యర్థులు 25 వేల రూపాయలు, ఓసీ అభ్యర్థులు 50 వేల రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తుతో పాటు అందరూ ప్రమాణ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది.
ఆశావహుల కోసం 4 పేజీల దరఖాస్తును గాంధీ భవన్‌లో అందుబాటులో ఉంచారు. వ్యక్తిగత వివరాలతో పాటు పార్టీలో ప్రస్తుత హోదా, గతంలో పార్టీకి చేసిన సేవ, పొందిన పదవులు, గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, ఎన్నికల్లో గెలుపు ఓటములు, విద్యార్థి, యువజన ఉద్యమాల్లో పాత్ర, సోషల్ మీడియా కార్యకలాపాలు, పోటీ చేయదలచిన సెగ్మెంట్‌తో పాటు క్రిమినల్ కేసులు, కోర్టు శిక్షలు సహ అనేక వివరాలు దరఖాస్తులో తెలపాల్సి ఉంటుంది.
ఈ దరఖాస్తులను కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత వాటిని కేరళ ఎంపీ మురళీధరన్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీకి అప్పగిస్తారు. అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్ పరిశీలించిన తర్వాత అభ్యర్థులను పిలిచి నేరుగా మాట్లాడే అవకాశాలూ ఉన్నాయి. నియోజకవర్గాలవారీగా పార్టీ నిర్వహిస్తున్న సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తారు. ప్రతీ నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్లను సిఫార్సు చేస్తూ ఆమోదం కోసం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటికీ అప్పగిస్తారు. అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని టీపీసీసీ ఇప్పటికే ప్రకటించింది.
ఇదిలావుంటే, ఫస్ట్ లిస్ట్‌పై తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. గాంధీభవన్‌లోనూ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు మొదలైంది. అయితే ఎవరైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కండీషన్స్ అప్లై అంటోంది కాంగ్రెస్ పార్టీ. దీనిపై సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది. మరి అభ్యర్ధులను ఎప్పటిలోపు ప్రకటిస్తారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్.. పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. వచ్చే నెల మొదటి వారంలో తొలి జాబితాను ప్రకటించేందుకు హస్తం పార్టీ హైకమాండ్ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే.. గాంధీ భవన్‌లో ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి కీలక చర్చ జరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
