AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి.. మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు

Telangana: దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజా సొమ్మును కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. పోలీసులతో ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ నడుపుతున్నారు. హజ్ యాత్రికులను కలవడానికి వెళ్లకుండా మాజీమంత్రి షబ్బీర్ అలీని గృహ నిర్బందం చేశారు.

Revanth Reddy: అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి.. మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Revanth Reddy
Sanjay Kasula
|

Updated on: Jun 22, 2023 | 3:30 PM

Share

హైదరాబాద్, జూన్ 22: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017లో నిర్మాణం చేపట్టినప్పుడు రూ. 66 కోట్లు అంచనా వేశారని.. అది ఇప్పుడు ర. 155 కోట్లకు చేరిందన్నారు. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై మంత్రి కేటీఆర్‌ అవినీతికి పాల్పడ్డారని అన్నారు రేవంత్‌రెడ్డి. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజా సొమ్మును కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. పోలీసులతో ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ నడుపుతున్నారు. హజ్ యాత్రికులను కలవడానికి వెళ్లకుండా మాజీమంత్రి షబ్బీర్ అలీని గృహ నిర్బందం చేశారు. తెలంగాణ అమరవీరుల పోరాటాల చరిత్రతో అమరవీరుల స్థూపం ఉండాలి. నేడు అమరవీరుల త్యాగాల భోగాలతో సీఎం కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఉద్యమ కారుల త్యాగాలను అవమానించే విధంగా అమరవీరుల స్థూపం ఆవిష్కరణ జరుగుతుంది.

రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలంగాణ అమరవీరులు 1200 మంది అని ప్రభుత్వం చెప్పలేదని అన్నారు. తెలంగాణ తొలి శాసనసభ స్పీచ్ లో సీఎం కేసీఆర్ చెప్పలేదా.. నాడు శాసనసభలో అమరవీరులపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను అవమానించే విధంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణానికి సంబంధించి 2017 జూన్ 17 న కమిటీ రూపొందించింది. అమరవీరుల స్థూపాన్ని నిర్మించడం కోసం నిర్మాణ పనులను పర్యవేక్షణ చేయడానికి 6 శాతం డబ్బులు చెల్లించారని విమర్శించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.

అమరవీరుల స్థూప నిర్మాణానికి 63 కోట్ల 75 లక్షల 35 వేల 381 రూపాయలతో టెండర్లు పిలిచారు. కె.సి.పి ప్రాజెక్ట్స్ పేరుతో కె.సి పుల్లయ్య కంపెనీకి టెండర్లు దక్కించుకున్నారు. కేటీఆర్ మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్ కు దగ్గరి వ్యక్తి కామిశెట్టి అనిల్ కుమార్ దక్కించుకున్నారు. ఆ తర్వాత 80 కోట్లు…ఆ తర్వాత 127 కోట్ల 50 లక్షలకు అంచనా వ్యయం పెంచారు. మళ్ళీ అంచనాకు 158 కోట్ల 85 లక్షలకు పెంచారు. ఆ తర్వాత 179 కోట్ల 5 లక్షలకు పెంచారు. నూతన అమరవీరుల స్థూపంలో అమరవీరుల పేర్లను రాయలేదు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పేరు ఎందుకు పెట్టాలి. తెలంగాణ ఉద్యమం అంటే సీఎం కేసీఆర్ కుటుంబం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అమరవీరుల స్థూపం అంటే తెలంగాణ ఉద్యమం ప్రతిధ్వని. శ్రీకాంతాచారి,యాదయ్య లాంటి తెలంగాణ అమరవీరుల త్యాగం అని అన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.

నిజామాబాద్ ఉప ఎన్నికల్లో డి.శ్రీనివాస్ ఓడిపోతే ఇషాన్ రెడ్డి తన ప్రాణాన్ని త్యాగం చేశారు కానిస్టేబుల్ క్రిష్ణయ్య తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. అమరవీరుల స్థూపాన్ని సమైక్య వాదులు తాకాలంటే క్షమాపణ చెప్పి తాకాలి. అమరవీరుల స్థూప నిర్మాణం బాధ్యతను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి అప్పగించారు. అమరవీరుల స్థూపాన్ని కట్టడానికి తొమ్మిదేళ్లు పట్టింది. తొమ్మిది నెలల్లో ప్రగతి భవన్ కట్టుకున్నారు. పవిత్రమైన తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణాన్ని ఆంధ్రా వారికి ఎలా కట్టబెడతారా అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహరించారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో స్టెయిన్ లెస్ స్టీల్ ను వాడారు 8 ఎంఎం కు అంచనా వేసి 4 ఎంఎం స్టెయిన్ లెస్ స్టీల్ వాడారు. అడవుల్లో కట్టిన స్థూపాలు సైతం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కేవలం 520 మంది తెలంగాణ ఉద్యమ కారులకు మాత్రమే ఆర్థిక సహాయం చేసింది. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్ళు అయినా ఉద్యమకారుల వివరాలు దొరకలేదా.. వచ్చే డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 1569 మంది అమరవీరుల స్థూపాన్ని పేర్లతో సహా లిఖిస్తామన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తుంచి నెలకు 25 వేల పెన్షన్ ఇప్పించి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1569 మంది అమరవీరుల కుటుంబాలకు సెక్రటేరియట్ వద్ద సహపంక్తి భోజనం ఏర్పాటు చేసి గాంధీ కుటుంబంతో సన్మానం చేస్తాము. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారందరిపై విచారణ చేసి చర్లపల్లి జైలుకు తోలుతాము. అమరవీరుల స్థూపంలో అమరవీరుల పేర్లు వుండాలి. డిసెంబర్ 9 2023 కల్లా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం