Telangana: ముద్దు ముద్దు మాటలతో వలపు వల.. ముగ్గులోకి దింపి నీలి చిత్రాలు.. ఆపై.. !
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అమాయక వ్యక్తులను, ముఖ్యంగా ధనవంతులను టార్గెట్ చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. మహిళలతో వల వేసి, ఏకాంతంగా ఉన్న సమయంలో నగ్న వీడియోలు తీసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న హనీ ట్రాప్ ముఠాను మెట్‌పల్లి పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న రౌడీ షీటర్ కోరుట్ల రాజుతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అమాయక వ్యక్తులను, ముఖ్యంగా ధనవంతులను టార్గెట్ చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. మహిళలతో వల వేసి, ఏకాంతంగా ఉన్న సమయంలో నగ్న వీడియోలు తీసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న హనీ ట్రాప్ ముఠాను మెట్‌పల్లి పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న రౌడీ షీటర్ కోరుట్ల రాజుతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మెట్‌పల్లి దుబ్బవాడకు చెందిన కోరుట్ల రాజ్‌కుమార్ అలియాస్ రాజుపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయి. పోలీసులు రాజుపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో రాజు, భర్తకు దూరంగా ఉంటున్న బలుమూరి స్వప్న అనే మహిళతో చేతులు కలిపాడు. వీరిద్దరితో పాటు బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్, మాగని దేవా నర్సయ్యలు ఒక ముఠాగా ఏర్పడ్డారు.
హనుమాన్ నగర్‌లోని ఒక గదిని అద్దెకు తీసుకున్న ఈ ముఠా, మహిళల పట్ల బలహీనత ఉన్న ధనవంతుల ఫోన్ నంబర్లు సేకరించారు. స్వప్న వారితో ఫోన్‌లో కవ్వించి మాట్లాడుతూ.. తన గదికి రప్పించేది. బాధితులు లోపలికి వెళ్లి నగ్నంగా ఉన్న సమయంలో, నిందితులు ఒక్కసారిగా గదిలోకి ప్రవేశించి సెల్ ఫోన్లలో వీడియోలు తీసేవారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. ఇప్పటికే ఈ ముఠా పలువురిని బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది.
మూడు నెలల క్రితం మెట్‌పల్లికి చెందిన ఒక వ్యాపారిని టార్గెట్ చేసిన ఈ ముఠా, డిసెంబర్ 28వ తేదీన ప్లాన్ ప్రకారం గదికి పిలిపించి నగ్న వీడియోలు తీసింది. విషయం బయటకు రాకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. బాధితుడు ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితుల నుండి 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో గతంలో వారు చేసిన బ్లాక్ మెయిల్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఇటువంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్‌పల్లి పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దని సిఐ వి. అనిల్ కుమార్ ప్రజలకు సూచించారు. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
