జీడిపప్పు ఎక్కువ తింటే ప్రమాదమా? నిపుణుల హెచ్చరిక ఇదే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జీడిపప్పును మన ఆహారంలో తరచూ తీసుకుంటూ ఉంటాం. అయితే, జీడిపప్పును ఎక్కువగా తీసుకోవడం పలు సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు జీడిపప్పును ఎక్కువగా తీసుకోకపోవడం మంచిందని అంటున్నారు. జీడిపప్పును మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదంటున్నారు.

జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ లాంటి డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతుంటారు. డ్రైఫ్రూట్స్ రుచికరంగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కారణంగానే వీటి ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ సంపన్నుల నుంచి సామాన్య ప్రజల వరకు వీటిని తమ ఆహారంలో తీసుకుంటున్నారు. అయితే, వీటిని అతిగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
జీడిపప్పును చాలా మంది తమ వంటకాల్లో వినియోగిస్తుంటారు. పాయసం తోపాటు వెజ్, నాన్ వెజ్ పులావ్, బిర్యానీ, స్వీట్లు, బిస్కెట్లు, కేకులు, టాపింగ్ ఐస్‌క్రీమ్స్ లాంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కొందరు జీడిపప్పును మాసాల పొడి లేదా కారం లేదా మిరియాల పొడితో నెయ్యిలో వేయించి సేవిస్తారు. ఇలా చాలా రకాలుగా జీడిపప్పును తమ ఆహార పదార్థాల్లో తీసుకుంటూ వాటి ప్రయోజనాన్ని శరీరానికి అందిస్తుంటారు.
జీడిపప్పు మితంగా తింటేనే
జీడిపప్పు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతారు. అంతేగాక, శరీర జీవక్రియను పెంచుతాయి. జీడిపప్పులో మోనోఅన్శాజురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. వీటితో గుండె ఆరోగ్యానికి ప్రయోజనమే ఉన్నప్పటికీ.. హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు మాత్రం జీడిపప్పును ఎక్కువగా తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు ఆరోగ్య సమస్యలు కారణమవుతుందని చెబుతున్నారు. జీడిపప్పు ఆరోగ్యకరమైనది అయినప్పటికీ మితంగా తింటేనే మంచిదని అంటున్నారు. జీడిపప్పును తక్కువ మొత్తంలో తరచూ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు అని చెబుతున్నారు.
జీడిపప్పు దినోత్సవం
కాగా, ప్రతీ సంవత్సరం నవంబర్ 23న జీడిపప్పు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఆచారం మొదట అమెరికాలో ప్రారంభమైంది. జీడిపప్పు చెట్టు ఈశాన్య బ్రెజిల్‌లో పుట్టిందని చెబుతుంటారు. జీడి పప్పు రైతులను గౌరవించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతారు. సాధారణంగా జీడిపప్పు చెట్టు జీవితకాలం 60 ఏళ్లు. జీడిపప్పు నాటిన మూడేళ్లలోపు దిగుబడిని ఇవ్వడం ప్రారంభిస్తుంది. గరిష్ట పంటకు ఎనిమిదేళ్లు పట్టవచ్చు.