AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి పేరును ప్రకటిస్తారా? వాయిదా వేస్తారా..?

లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ స్థానాల గెలుపు జోష్ ను భారతీయ జనతా పార్టీ కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఢిల్లీలో గద్దెనెక్కిన కాషాయ పార్టీకి గల్లీలో గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. అందుకు బీజేపీ కార్యవర్గ సమావేశం వేదికగా కార్యాచరణ సిద్దం చేయబోతోంది.

Telangana BJP: రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి పేరును ప్రకటిస్తారా? వాయిదా వేస్తారా..?
Telangana Bjp
Balaraju Goud
|

Updated on: Jul 06, 2024 | 4:09 PM

Share

లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ స్థానాల గెలుపు జోష్ ను భారతీయ జనతా పార్టీ కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఢిల్లీలో గద్దెనెక్కిన కాషాయ పార్టీకి గల్లీలో గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. అందుకు బీజేపీ కార్యవర్గ సమావేశం వేదికగా కార్యాచరణ సిద్దం చేయబోతోంది.

తెలంగాణ బీజేపీ లోకల్ బాడీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని కాషాయ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించబోతుంది. ఈ నెల12న హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముందుగా పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు ప్రకటించనున్నారు. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యే అవకాశాలున్నాయి.

గ్రౌండ్ లెవల్‌లో పార్టీ బలంగా ఉంటేనే తెలంగాణలో అధికారం సాధించడం ఈజీ అవుతుందని గుర్తించిన కాషాయ పార్టీ అగ్రనేతలు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 8 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన తెలంగాణ బీజేపీ.. కేవలం ఢిల్లీలో గెలిచే పార్టీ అనే ముద్రను తొలగించుకుని గల్లీలో కూడా సత్తా చూడాలని కమలనాథులు భావిస్తున్నారు. రాబోయే ఆరు మాసాల వ్యవధిలోనే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశముంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతానికి పైగా ఓట్లు.. 8 అసెంబ్లీ స్థానాలను సాధించిన బీజేపీ.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతానికి పైగా ఓట్లతో 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని తిరిగి లోకల్ బాడీలో సాధించడం బీజేపీ ముందున్న పెద్ద సవాల్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మాదిరిగా కొట్లాడతామని చెబుతున్నారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.

రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో 8 స్థానాల్లో గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఎలాంటి పోరాటాలు చేయాలనే దానిపై రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కొత్త సారథి పేరును ప్రకటిస్తారా? మరికొన్నాళ్లు వాయిదా వేస్తారా? కిషన్ రెడ్డి సారథ్యంలోనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తారా? అన్నది మాత్రం సస్పెన్స్ గానే మిగిలింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..