Telangana: 700ఏళ్ల చరిత్ర కలిగిన కోనేటిని రాత్రికి రాత్రే పూడ్చేశారు.. బాదేపల్లి గుట్టపై ఏం జరుగుతోంది!

ఆ కోనేరుకు సుమారు 700ఏళ్ల చరిత్ర ఉంది. స్వయంగా వెలసిన రంగనాయకస్వామి వారి అభిషేక జలాలతో నిత్యం కళకళలాడుతుంది. ఆ కోనేటి జలం భక్తులకు పరమ పవిత్రం. భక్తుల అధ్యాత్మికతతో అనుబంధం ఉన్న కోనేరును అభివృద్ధి పేరిట పూడ్చేశారు.

Telangana: 700ఏళ్ల చరిత్ర కలిగిన కోనేటిని రాత్రికి రాత్రే పూడ్చేశారు.. బాదేపల్లి గుట్టపై ఏం జరుగుతోంది!
Badepalli Gutta Koneru
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Jul 13, 2024 | 4:36 PM

ఆ కోనేరుకు సుమారు 700ఏళ్ల చరిత్ర ఉంది. స్వయంగా వెలసిన రంగనాయకస్వామి వారి అభిషేక జలాలతో నిత్యం కళకళలాడుతుంది. ఆ కోనేటి జలం భక్తులకు పరమ పవిత్రం. భక్తుల అధ్యాత్మికతతో అనుబంధం ఉన్న కోనేరును అభివృద్ధి పేరిట పూడ్చేశారు. అది కూడా అమవాస్య రోజున. అసలు బాదేపల్లి గుట్టపై పూడ్చివేత కంటే ముందు తవ్వకాలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మహబూబ్ నగర్ జిల్లా పట్టణానికి ఆనుకొని ఉన్న బాదేపల్లి పెద్దగుట్ట రంగనాయకస్వామి ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారం. ఎత్తైన గుట్టపై పచ్చని చెట్ల మధ్య సుమారు ఏడు వందల ఏళ్ల క్రితం రంగనాయకస్వామి స్వయంభుగా వెలిశాడని భక్తులు నమ్మకం. శ్రావణమాసం వచ్చిందంటే చాలు గుట్టపై భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారి ఆలయంలో ఎలాంటి దీపాలు, విద్యుత్ దీపాలు అస్సలే లేవు. పవళించిన రూపంలో ఉండే స్వామివారికి ఎండ, వాన నేరుగా అభిషేకం చేస్తుంటాయి.

అయితే రంగనాయకుల స్వామివారి విగ్రహానికి ఎంత చరిత్ర ఉందో ఆలయానికి ఆనుకొని ఉన్న కోనేరుకు అంతే చరిత్ర ఉంది. స్వామివారికి కోనేటిలోని నీటితో అభిషేకం చేస్తారు. అందుకే కోనేరు జలం ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు. కుటుంబంలో ఎవరూ అనారోగ్యంతో ఉన్నా… పంటపొలాలను చీడపీడలు పీడిస్తున్న ఈ నీటిని ఔషధంలా ఉపయోగిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా కోనేటిలో అడుగు పెట్టందే గుడిలోకి వెళ్లరు.

వివాదంగా కోనేరు పూర్చివేత

అంతటి ప్రాశస్త్ర్యం కలిగిన ఈ కోనేరు పూడ్చివేత ఇప్పుడు వివాదంగా మారింది. అభివృద్ధి పనుల పేరిట పరమ పవిత్రమైన కోనేరును పూర్తిగా మూసేశారు. దీనికి తోడు స్వామి వారి ఆలయానికి పక్కనే ఉన్న ముడుపులు కట్టే చెట్టును కూల్చేశారు. మండపాన్ని తొలగించారు. విషయం తెలుసుకున్న భక్తుల్లో ఆందోళన మొదలైంది. అసలు అమావాస్య నాడు కోనేరు పూడ్చడమేంటి అన్న వివాదం తెర మీదకు వచ్చింది. కేవలం గుప్త నిధుల కోసమే కోనేరులో తవ్వకాలు జరిపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరలో శ్రావణమాసం రాబోతున్న నేపథ్యంలో భక్తులకు అనుమానం రాకుండా ఉండేందుకే కోనేటిని పూడ్చివేశారని చర్చలు మొదలయ్యాయి.

విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఈ వ్యవహారంపై ఆందోళన బాట పట్టాయి. గుట్టపై ఏం జరుగుతోందో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా జడ్చర్ల పట్టణ బంద్ కొనసాగించారు. టౌన్ లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇక మరోవైపు పెద్ద గుట్ట ఘటనపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాయకులస్వామి వారి కోనేటి పూడ్చివేతపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎంపీ డికే అరుణ. జడ్చర్ల సీఐ ఆది రెడ్డి, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదనీ హెచ్చరించారు. ఇక, భక్తుల ఆరోపణలతో గుట్టను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సందర్శించారు. భక్తుల మనోభావాలకు భాగం కలిగిస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు.

అభివృద్ధి పనుల్లో భాగంగానే…: రంగనాయక స్వామివారి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగానే ఈ పనులు జరిగాయని ఆలయ ధర్మకర్త రవితేజ గౌడ్ చెబుతున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు. వాస్తు ప్రకారం ఈశాన్యంలో ఉండాల్సిన కోనేరు ఆగ్నేయం మూలలో ఉందని చెప్పుకొచ్చారు. సుమారు రూ.5కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించామన్నారు. రాతికట్టడంతో ఆలయ నిర్మాణం జరగబోతుందని… త్వరలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కొంతమంది కావాలని దుష్పప్రచారం చేస్తున్నారని ఆరోపించారు రవితేజ గౌడ్. ఇక కోనేరులో గుప్పనిధుల తవ్వకాల ప్రచారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోనేరు పూడ్చివేతకు సంబంధించి ధర్మకర్త రవితేజ గౌడ్ ని విచారించామని జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి వెల్లడించారు. దర్యాప్తులో తేలిని అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని పూడ్చిన కోనేటిని పుర్వ స్థితికి తెచ్చామన్నారు. గుట్టపై పోలీస్ శాఖ కు సంబంధించిన సీసీ కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలిస్తామని సీఐ తెలిపారు. భక్తుల మనోభావాలతో కూడిన ఈ అంశంలో ఎవరిని సంప్రదించకుండా 700ఏళ్ల చరిత్ర కలిగిన కోనేరు, మండపాన్ని తొలగించడం వివాదాస్పదం అయ్యింది. అసలు అమవాస్య రోజున పనులపై భక్తులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…