TGSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రూట్లలో టికెట్ రేట్లు తగ్గింపు..
ఇటీవల స్పెషల్ బస్సుల్లో టికెట్లు పెంచి ప్రయాణికులకు షాక్ ఇచ్చిన టీజీఎస్ఆర్టీసీ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లను తగ్గించింది. కానీ అది కొన్ని ప్రత్యేక రూట్లలోని బస్సుల్లో మాత్రమే తగ్గించింది. ఆ బస్సులు ఏవి..? టికెట్లు ఎంత తగ్గించిందనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న ఆఫర్లను తీసుకొస్తుంది. పండగ సీజన్‌లలో నగదు బహుమతులు వంటి పథకాలతో ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకుంటున్న టీజీఎస్‌ఆర్టీసీ.. తాజాగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. హైదరాబాద్ – బెంగళూరు మధ్య నడిచే బస్సులలో ప్రయాణ ఛార్జీలపై 20 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య టీజీఎస్‌ఆర్టీసీకి చెందిన పలు రకాల బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్, లహరి నాన్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్, లహరి ఏసీ స్లీపర్ బస్సులు ఉన్నాయి. జహీరాబాద్, వరంగల్, ఖమ్మం, మియాపూర్, పికెట్, నిజామాబాద్ వంటి డిపోల నుంచి మొత్తం 24కు పైగా సర్వీసులు ప్రతిరోజు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి.
ఈ బస్సుల్లో డిస్కౌంట్
ఈ డిస్కౌంట్ ఆఫర్ సూపర్ లగ్జరీ – లహరి ఏసీ బస్సులకు వర్తిస్తుందని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. సూపర్ లగ్జరీ బస్సులలో ప్రస్తుత ఛార్జీలలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. లహరి ఏసీ బస్సులలో 25 శాతం మేర ఛార్జీలు తగ్గుతాయి. ఈ డిస్కౌంట్ ద్వారా ఒక్కో టికెట్‌పై ప్రయాణికులకు రూ.100 నుంచి రూ.150 వరకు ఆదా అవుతుంది.
ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతుంది. తమ అధికారిక వెబ్‌సైట్ https://www.tgsrtcbus.in ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రయాణికులకు సూచించారు. ఈ నిర్ణయం ద్వారా బెంగళూరు వైపు ప్రయాణించే వారికి కొద్దిగా భారం తగ్గనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




