Telangana: ఆహా ఎంత చల్లటి వార్త.! తెలంగాణలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే.?
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం చల్లబడనుంది. ఉపరితల ద్రోణుల ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల వాతావరణ మార్పులకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రంజారీ చేసిన హెచ్చరికలు ఇలా ఉన్నాయి. వేడికి కాస్త ఉపశమనం ఇస్తూ.. మరో మూడు రోజులు వాతావరణం చల్లబడనుంది. తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అలాగే, ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు మరొక ద్రోణి ఏర్పడింది. వీటితో పాటు మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఉత్తర కర్ణాటక పరిసరాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది. ఈరోజు(ఏప్రిల్ 19) నుంచి మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలలో రానున్న రెండు రోజుల్లో పెద్దగా మార్పులు ఉండవని వాతావరణ కేంద్రం తెలిపింది.
రాబోయే మూడు రోజులు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల వడగళ్ల వాన కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, వడగళ్ల వానల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు తమ పంటలు, పశువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది.
ఇది చదవండి: ఇది ఒక్క చెంచా వేస్తే.. మందార మొక్క గుత్తులు గుత్తులుగా పువ్వులతో నిండిపోతుంది..
