తెలంగాణలో రాహుల్‌గాంధీ సుడిగాలి పర్యటన.. హస్తం పార్టీ నేతల్లో జోష్‌

రాహుల్‌ పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ నింపుతోంది. ఒకేరోజు ఐదు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ..బీఆర్‌ఎస్‌, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ఆరు గ్యారంటీలు, ఉచిత పథకాలతో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు రాహుల్‌గాంధీ. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో రాహుల్‌గాంధీ సుడిగాలి పర్యటన.. హస్తం పార్టీ నేతల్లో జోష్‌
Rahul Gandhi
Follow us

|

Updated on: Nov 17, 2023 | 9:35 PM

కాంగ్రెస్‌ అగ్రనేతల పర్యటనలతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముమ్మరం అందుకుంది. AICC నేత రాహుల్‌గాంధీ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. భద్రాద్రి కొత్తగూడెంజిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలం అంబేద్కర్ సెంటర్లో జరిగిన రోడ్‌షోలో రాహుల్‌ పాల్గొన్నారు. BRS ప్రభుత్వంతో ప్రజలు దగాకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో వందలకోట్లు దోచుకున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇంట్లో తప్ప 24గంటల కరెంట్ ఎక్కడా రావడం లేదన్నారు. కాంగ్రెస్ తుఫాన్ వస్తోందని.. కేసీఆర్‌కు అర్థమైందన్నారు.అధికారంలోకి వచ్చాక.. ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్‌.

“కేసీఆర్ ఇంట్లో తప్ప 24గంటల కరెంట్ ఎక్కడా రావడం లేదు. కేసీఆర్‌ ఇంట్లో నుంచి బయటకు రావడం తక్కువ కాబట్టి రాష్ట్రమంతా కరెంట్ వస్తుందని అనుకుంటున్నారు. ఇక్కడి రైతులకు మేం 24 గంటల కరెంట్ ఇస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్ వస్తోందని.. కేసీఆర్‌కు అర్థమైంది” అని రాహుల్ పేర్కొన్నారు.

పినపాక నియోజకవర్గం నుంచి రాహుల్‌గాంధీ నేరుగా వరంగల్‌జిల్లా నర్సంపేటలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌కి వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని ఆరోపించారు రాహుల్‌గాంధీ. తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తోందని, పార్లమెంట్‌లో బీజేపీకి బీఆర్ఎస్‌ సపోర్ట్‌ చేస్తోందని రాహుల్‌ మండిపడ్డారు.

“తెలంగాణలో బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే. తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తోంది. పార్లమెంట్‌లో బీజేపీకి బీఆర్ఎస్‌ సపోర్ట్‌ చేసింది. కాంగ్రెస్‌ ఎక్కడైతే ఎన్నికల్లో నిలబడుతుందో అక్కడ ఎంఐఎం పోటీ చేస్తుంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ మధ్యే జరుగుతోంది..కాంగ్రెస్‌ విజయం ఖాయం” అన్నారు రాహుల్.

ఇక వరంగల్‌ ఈస్ట్‌, వెస్ట్‌ నియోజకవర్గాల్లో రాహుల్‌గాంధీ పాదయాత్ర సాగింది. వరంగల్ హెడ్ పోస్టాఫీస్ నుంచి పోచమ్మ మైదాన్ వరకు రాహుల్‌ పాదయాత్ర చేశారు. చౌరస్తా, మండిబజార్ మీదుగా యాత్ర సాగింది. తర్వాత పోచమ్మ మైదాన్ దగ్గర కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తానికి రాహుల్‌ సుడిగాలి పర్యటనతో హస్తంపార్టీనేతల్లో జోష్‌ పెరిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.