AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tension in Bodhan: బోధన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఛత్రపతి శివాజీ విగ్రహం.. పక్కా ఫ్లాన్‌గా తేల్చిన పోలీసులు!

గతి తప్పిన జీవితాలను గమ్యం వైపు నడిపించిన వారిపై ప్రేమతో పెట్టుకునే.. నిలువెత్తు ఆకారాలే విగ్రహాలు.

Tension in Bodhan: బోధన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఛత్రపతి శివాజీ విగ్రహం.. పక్కా ఫ్లాన్‌గా తేల్చిన పోలీసులు!
Tension In Bodhan
Balaraju Goud
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 21, 2022 | 2:19 PM

Share

Tension in Bodhan: ఒక జాతికి మార్గం చూపిన వారికి గుర్తుగా.. పీడిత, అణగారిన వర్గాల కోసం పోరాటానికి ప్రతీకగా.. సమాజం కోసం పోరాడి అమరులైన వారి జ్ఞాపకంగా.. గతి తప్పిన జీవితాలను గమ్యం వైపు నడిపించిన వారిపై ప్రేమతో పెట్టుకునే.. నిలువెత్తు ఆకారాలే విగ్రహాలు. ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి.. మహా నగరం వరకు.. ఎక్కడ చూసినా.. విగ్రహం లేని గ్రామం ఉండదు. వాడ వాడలా ఎందరో మహనీయుల విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. ఊరిలో గుడి.. వీధిలో విగ్రహం వెరీ కామన్.. కానీ ఇప్పుడు విగ్రహాలు వివాదాలకు కారణం అవుతున్నాయి. కొందరిలో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. బోధన్ శివాజీ విగ్రహం అంశం కాస్తా.. బీజేపీ వర్సెస్ పోలీసుల మధ్య హై ఓల్టేజ్ ఫైట్‌‌గా మారింది.

బోధన్‌లో రాత్రికి రాత్రే ఛత్రపతి శివాజీ విగ్రహం పుట్టుకొచ్చింది. శివసేన, బీజేపీ కార్యకర్తలు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటివరకూ లేని విగ్రహం తెల్లారేసరికి రావడంపై మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే విగ్రహాన్ని తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తే.. ప్రసక్తే లేదంటూ మరో వర్గం పట్టుబట్టింది. చివరికి రాళ్ల దాడులు కూడా జరిగాయి. ఇరువర్గాలను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగం చేయాల్సి వచ్చింది.

బోధన్ పట్టణం అంతా నిర్మాణుష్యంగా మారింది. స్థానికులు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. నగరమంతా పోలీసుల కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది. బీజేపీ బంద్‌కు పిలుపునివ్వడంతో.. 144 సెక్షన్ విధించి అల్లర్లు రిపీట్ కాకుండా వందలాది మంది నగరంలో మొహరించారు. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుంటామని చెప్తోంది పోలీస్ యంత్రాంగం. అల్లర్ల వెనుకాల కుట్ర కోణం ఉందని పోలీసులు తేల్చారు. శివసేన కు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఉన్నట్టు నిర్ధారించారు. నెలరోజుల క్రితం బోధన్ మున్సిపల్ కౌన్సిల్‌లో విగ్రహ ప్రతిష్ఠానకు తీర్మానం చేసినట్లు అడిషనల్ డీజీ నాగి రెడ్డి తెలిపారు. అయితే, ఎప్పుడు పెట్టాలి అన్న దానిపై ఇంకా కౌన్సిల్ డిసిషన్ తీసుకోలేదన్నారు. వారం క్రితం గోపి , కౌన్సిలర్ శరత్ లు కలిసి విగ్రహ ప్రతిష్టకు ప్లాన్ చేశారని డీజీ తెలిపారు. కావాలనే ఎవరికీ తెలియకుండా ఈ వ్యవహారం నడిపించింది గోపి, శరత్ అని నాగిరెడ్డి వెల్లడించారు. అల్లర్ల వెనుకాల ఉన్న ఉద్దేశాల ఫై పోలీస్ శాఖ ఆరా తీస్తున్నామని, బోధన్ అల్లర్ల వెనుకాల ఎవరు ఉన్న వదిలిపెట్టమని డీజీ నాగిరెడ్డి హెచ్చరించారు.

ఇదిలావుంటే, బోదన్‌ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటుపై కొందరు కావాలనే వివాదం సృష్టిస్తున్నట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. శివాజీ విగ్రహం ఏర్పాటుకు ఆరునెలల క్రితమే మున్సిపల్‌ కౌన్సిల్‌ అనుమతి ఇచ్చినా ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులు ఎందుకు లాఠీచార్జ్‌ చేశారని ప్రశ్నించారు. శివాజీ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ ప్రేమేందర్‌ రెడ్డి. ఇది ఎంతమాత్రం సహించబోమని తేల్చిచెప్పారు.

బోధన్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఘటనలో విచారణ కొనసాగుతున్న పోలీసులు.. ఇప్పటి వరకు 10 మంది పై కేసు నమోదు చేశారు. శివసేన జిల్లా అధ్యక్షులు గోపి, బిజెపి నేతలు మాల్యాద్రి రెడ్డి, అడ్లూరు శ్రీనివాస్, కొలిపాక బాల రాజు, కుర్రోళ్ల శ్రీధర్‌లపై కేసులు నమోదు చేశారు. నిందితులపై 147, 148, 307 , 353, 188r/w 149 Ipc సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

మరోవైపు సున్నితమైన ఈ అంశంలో ఏం నిర్ణయం తీసుకోవాలో అర్ధంకాక పోలీసులు తలపట్టుకుంటున్నారు. శివాజీ విగ్రహం ఉంచాలో తియ్యాలో తెలీక తికమక పడుతున్నారు. ఏం చేస్తే ఎటువైపు నుంచి రియాక్షన్ వస్తుందో తెలీక సందిగ్ధంలో ఉన్నారు పోలీసులు.

Read Also… 

త్వరలోనే హైదరాబాద్ ఫైల్స్ అనే సినిమా వస్తుంది.. బీజేపీ లీడర్ మురళీధర్ రావు కీలక వ్యాఖ్యలు