School Reopen: పిల్లల భవిష్యత్ కోసమే స్కూళ్లు తెరిచాం.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
కరోనా కల్లోలం అనంతరం ఎట్టకేలకు తెలంగాణలో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. సమస్యలు, సవాళ్ల మధ్య పిల్లలు ఏ మేరకు బడిబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 నెలల విరామం తర్వాత విద్యాసంస్థలు ఓపెన్...
Telangana Schools Reopen from Today: కరోనా కల్లోలం అనంతరం ఎట్టకేలకు తెలంగాణలో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. సమస్యలు, సవాళ్ల మధ్య పిల్లలు ఏ మేరకు బడిబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 నెలల విరామం తర్వాత విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఏడాదిన్నరగా ఇంటికే పరిమితమైన పిల్లలు బడి బాట పట్టారు. బ్యాగులు భుజాన వేసుకుని స్కూళ్లకు వెళ్లారు. పాఠశాలల పునఃప్రారంభంతో స్కూళ్లన్నీ సందడిగా మారిపోయాయి.
మొదటి రోజు 40శాతం విద్యార్ధులు స్కూళ్లకు హాజరయ్యారని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం కోవిడ్ రూల్స్ పాటిస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్న సబిత.. గ్రామపంచాయతీ, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పక్కాగా శానిటేషన్ చేపడుతున్నామన్నారు. ధైర్యంగా పిల్లల్ని స్కూళ్లకు పంపొచ్చని భరోసా ఇచ్చారు. కరోనా భయం వెంటాడుతున్నా, పిల్లల భవిష్యత్ కోసమే స్కూళ్లకు అనుమతి ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
గతంలో కంటే కఠిన నిబంధనలు అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు, అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదేశాలు ఇచ్చామన్నారు. అలాగే మధ్యాహ్న భోజన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని మంత్రి సబితా స్పష్టం చేశారు. పేరెంట్స్ నమ్మకాన్ని నిలబెట్టేలా ఉపాధ్యాయులు, అధికారులందరూ వ్యవహరించాలని మంత్రి కోరారు. రెసిడెన్షియల్ తప్ప మిగతా పాఠశాలలను ప్రారంభించాలని ఆదేశించామని.. కొత్తగా లక్షా ఇరవై వేల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు.. ఇంటర్ లో లక్షమంది వరకు పిల్లలు ప్రభుత్వ కాలేజీలో చేరారని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో రెండున్నర లక్షలకు పైగా విద్యార్థులు చేరారని మంత్రి సబితా వెల్లడించారు.
ఇదిలావుంటే, స్కూల్స్ ఓపెనింగ్ సందర్భంగా, రాజ్ భవన్ ప్రభుత్వ స్కూల్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సందర్శించారు. ప్రతి క్లాస్ రూమ్ తిరుగుతూ స్టూడెంట్స్ తో మాట్లాడారు. పిల్లలను ధైర్యంగా స్కూళ్లకు పంపిన తల్లిదండ్రులను అభినందించిన గవర్నర్… ఇక జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్లదేనన్నారు.
ఏదేమైనా, స్కూల్ కి వచ్చి చదువుకుంటే ఆ మజానే వేరు. స్కూల్ లోనే నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అకడమిక్ పాఠాలతోపాటు అనేక మంచి విషయాలను స్కూల్ వాతావరణంలో ఆటోమేటిక్ గా తెలుసుకునే అవకాశముంటుంది. ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవడం వల్ల నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే, స్కూల్ లేదా కాలేజీకి వెళ్తే చాలు, అదే అన్నీ మనకు నేర్పిస్తుందని అంటారు. మొత్తానికి, ఏడాదిన్నరగా ఆన్ లైన్ క్లాసులతో విసిగిపోయిన పిల్లల్లో స్కూల్ వాతావరణం కొత్త జోష్ నింపుతోంది.