Rains Alerts: తెలంగాణలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
Rains Alerts: తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షం కారణంగా జనాలు అతలాకుతలం అవుతున్నారు. తెలంగాణలో పలు..
Rains Alerts: తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షం కారణంగా జనాలు అతలాకుతలం అవుతున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోతుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక తాజాగా నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. భైంసా మండలం మహాగామ్ – గుండెగావ్ గ్రామాల గల బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహించడంతో ఈ రెండు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కుభీర్ మండల కేంద్రంలో భారీ వర్షంతో ఇళ్లలోకి చేరిన వరద నీరు చేరింది. మేదరి గల్లీ లోని వరద నీటి లో చిక్కుకున్న 8 మందిని స్థానికుల సాయంతో పోలీసులు సురక్షితంగా కాపాడారు. కుబీర్ ముంపు వాసులకు గ్రామ పంచాయితీ కార్యాలయంలో పోలీసులు తాత్కాలికంగా పునరావాసం కల్పించారు. ఇక అర్థరాత్రి సమయంలో వరదలో చిక్కుకున్న ఓ ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ సహాయంతో బయటకు తీశారు. ప్రజలు రాత్రాంతా బిక్కబిక్కుమంటూ గడిపారు. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ఇంట్లో ఉన్న వస్తువులు సైతం తడిసిముద్దయ్యాయి. వర్షం కారణంగా తాము చాలా నష్టపోయామని, తమను అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు కదలికలు చురుగ్గా ఉండటంతో రెండు, మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులు అస్థిరంగా కదులుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలతో వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షా కారణంగా తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో సమీపంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.