Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam MLC: టీఆర్ఎస్ పార్టీకి సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక.. ఒక సీటు కోసం ఆరుగురు పోటీ..!

Khammam MLC: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారింది. జిల్లాలో ఉన్న ఒక్క ఎమ్మెల్సీ సీటుకు ఆరుగురు టీఆర్ఎస్ నాయకులు

Khammam MLC: టీఆర్ఎస్ పార్టీకి సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక.. ఒక సీటు కోసం ఆరుగురు పోటీ..!
Trs Huzurabad By Poll
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 18, 2021 | 5:25 PM

Khammam MLC: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారింది. జిల్లాలో ఉన్న ఒక్క ఎమ్మెల్సీ సీటుకు ఆరుగురు టీఆర్ఎస్ నాయకులు పోటీ పడడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశావహులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. టికెట్ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. సీటు దక్కించుకోవడం కోసం అధినేత కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. మరోవైపు అవకాశం కోసం టీఆర్ఎస్ అగ్రనేతలు నిరీక్షిస్తుండగా.. ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పట్టుపడుతుండటంతో సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తున్న ఎమ్మెల్సీ టిక్కెట్ పోరు. సీఎం కేసీఆర్ మదిలో ఉన్న నేత ఎవరనేది సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక టికెట్ దక్కించుకునేందుకై అగ్ర నేతలందరూ హైదరాబాద్‌లోనే మకాం వేశారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. టిఆర్ఎస్ పార్టీ నుంచి రేసులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, వద్దిరాజు రవిచంద్ర, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు, VVC గ్రూప్ సంస్థల అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ వంటి నేతలు టికెట్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టిఆర్ఎస్ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ కోసం వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ టికెట్ కోసం అనూహ్యంగా రాజేంద్రప్రసాద్ పేరు తెరమీదకు వచ్చింది.

ఎవరి బలం ఎంత? ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకునేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నేతలు తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ తో ఉన్న పరిచయం, తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా 2014 ఎన్నికల్లో విజయం సాధించి అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో సామాజిక వర్గల సమీకరణాలలో భాగంగా ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు. ఆ తర్వాత రాజ్యసభ టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా టికెట్ దక్కలేదు. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని హైదరాబాద్‌లోనే మకాం వేశారు పొంగులేటి.

ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సైతం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో తనకు మరోసారి అవకాశం దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీసీ, కాపు కులానికి చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర టిఆర్ఎస్ అధినాయకులతో తనకున్న పరిచయాలతో టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు సైతం టికెట్ సాధించేందుకు పావులు కదుపుతున్నారు. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన VVC సంస్థల అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కూడా ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్నది వేచి చూడాల్సిన అంశం. మంత్రి కేటీఆర్ కు పువ్వాడ అజయ్ కుమార్ సన్నిహితంగా ఉండటం వల్ల పువ్వాడ అజయ్ కుమార్ ఎవరి పేరు సూచిస్తారనే దానిపైనే తీవ్ర చర్చ జరుగుతోంది.

టిఆర్ఎస్ గెలుపు లాంఛనమే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు అధికార టీఆర్ఎస్ పక్షానే ఉన్నారు. 2019 లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఆ తర్వాత నిర్వహించిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ,ఎక్స్ అఫీషియో మెంబర్లు కలిపి 769 మంది ఉన్నారు.. అందులో టీఆర్ఎస్ కు 497 మంది ఓటర్లు ఉన్నారు. టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న వారికి గెలుపు లాంఛనమే కావడంతో అభ్యర్థి ఎవరనే చర్చ టీఆర్ఎస్ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే కొందరు నేతలు టికెట్ దక్కించుకునేందుకు మంత్రి కేటీఆర్ తో టచ్‌లో ఉండడంతో టిఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కుతుంది అన్న చర్చ మొదలైంది.

జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు అభిప్రాయం సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకుంటారా? లేక పార్టీ కోణంలో తనదైనశైలిలో ఆలోచించి టికెట్ కేటాయిస్తారా అన్నది వేచి చూడాల్సిన అంశం. ఆశావహులు అంతా శుభవార్త ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా? వీరిలో సీనియర్లు మాత్రం తమ ప్రయత్నాల్లో తాము నిమగ్నమయ్యారు. గెలుపునకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న టిఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ ఆశీస్సులు అందుకునే అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

వాసు, టీవీ9 రిపోర్టర్, ఖమ్మం.

Also read:

Electric Vehicle: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.1699 కడితే చాలు టూవీలర్ మీ సొంతం..!

CM Jagan: కుప్పం ఎఫెక్ట్‌‌తో అసెంబ్లీకి రాలేదేమో.. చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు..

IND vs NZ: లైవ్ మ్యాచ్‌లోనూ ప్రేయసి కోసం వెతుకుతోన్న భారత బౌలర్.. సహాయం చేసిన ఆయన సోదరి.. వైరలవుతోన్న ఫన్నీ వీడియో..!