Telangana Politics: ఎండలతోపాటే వేడెక్కుతున్న తెలంగాణ పాలిటిక్స్.. రాజకీయ పరిణామాలతో పార్టీలన్నీ బిజీ బిజీ..
మూడు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుండగానే ఇంకోవైపు పొలిటికల్ యాక్టివిటీ, మరోవైపు కేసులు, వాటి విచారణలు, నోటీసులు, అరెస్టులతో పొలిటికల్ అఫైర్స్ ఆసక్తిరేపుతున్నాయి.

మార్చిలో ఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతుంటే ఇంకోవైపు తెలంగాణలో రాజకీయం కూడా ఆ ఎండల మాదిరిగానే వేడెక్కుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుండగానే ఇంకోవైపు పొలిటికల్ యాక్టివిటీ, మరోవైపు కేసులు, వాటి విచారణలు, నోటీసులు, అరెస్టులతో పొలిటికల్ అఫైర్స్ ఆసక్తిరేపుతున్నాయి. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ .. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు నోటీసులివ్వడంతో పొలిటికల్ హీట్ పీక్ లెవెల్‌కు చేరుకుంది. విచారణ పేరిట పిలిచి ఒకట్రెండు రోజుల ఇంటరాగేషన్ తర్వాత కవితను అరెస్టు చేస్తారనే అందరూ భావిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళే ముందు కేసీఆర్ ఫ్యామిలీ మంతనాల్లో సైతం అరెస్టు తప్పదన్న అభిప్రాయమే వినిపించినట్లు మీడియా చెబుతోంది. దానికితోడు రామచంద్రన్ పిళ్ళై రిమాండు రిపోర్టులో ఆయన అప్రూవర్‌గా మారినట్లు పరోక్షంగా ప్రస్తావించింది ఈడీ. పిళ్ళైని కవితకు బినామీగా పేర్కొంది. అంటే కేసు తీవ్రత పిళ్ళై మీది నుంచి కవితపై మళ్ళినట్లుగా భావించాలి. అయితే, తానేం తప్పు చేయలేదని, ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని కవిత ఇటు హైదరాబాద్‌లోను, అటు ఢిల్లీలోను ధీమా వ్యక్తం చేశారు. మార్చి 10న మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలో కవిత దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్షకు విపక్షాలన్నింటినీ పిలవడం ద్వారా కేంద్రంపై యుద్దభేరి మోగించే వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ వున్నట్లు అవగతమవుతోంది. దీక్షకు కాంగ్రెస్ పార్టీ మినహా విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కవిత దీక్షకు హాజరై కేంద్రం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఎండగట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈక్రమంలో మార్చి 10న ఢిల్లీలో జరిగే కవిత దీక్ష విపక్షాల కూటమి ఏర్పాటు దిశగా అడుగులను వేగవంతం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్క కూటమిలో వుంటాయా లేదా అన్నది ఆసక్తికరం. జాతీయ స్థాయిలో మోదీని ధీటుగా ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పని చేయాలని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. కానీ తమతమ పార్టీలకు జాతీయస్థాయిలో ఒకరకమైన ప్రయోజనాలు, రాష్ట్ర స్థాయిలో మరో రకమైన ప్రయోజనాలు వున్నందున ఇప్పటికిప్పుడు (కనీసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలయ్యే దాకానైనా) కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూరాన్నే పాటిస్తాయన్నది సుస్పష్టం.
పోటాపోటీ దీక్షలు.. సంఘీభావాలు
ఢిల్లీలో దీక్ష, అక్కడే ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు దేశ రాజధానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి. ఇటు హైదరాబాద్‌లోను బీఆర్ఎస్ రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయనే చెప్పాలి. కవిత ఢిల్లీలో దీక్ష చేస్తున్న రోజునే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగబోతోంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ నేతలు, జిల్లాల అధ్యక్షులు, కార్పొరేషన్ల ఛైర్మెన్లు, జిల్లా పరిషత్‌ల ఛైర్మెన్లు, డీసీసీబీల ఛైర్మెన్లు, డీసీఎంఎస్‌ల ఛైర్మెన్లు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చే సందర్భంలో అక్టోబర్ 5వ తేదీన కూడా కేసీఆర్ ఇలాంటి విస్తృత సమావేశాన్నే నిర్వహించారు. ఈక్రమంలో మార్చి 10వ తేదీన జరగబోయే సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. షెడ్యూలు ప్రకారం ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం మాత్రమే వుంది. ఈనేపథ్యంలో రాబోయే కాలంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. అదేసమయంలో అసెంబ్లీ రద్దు అంశాన్ని కూడా కేసీఆర్ పార్టీ నాయకులతో చర్చించే అవకాశాలున్నాయి. తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి 2024 జనవరి 16వ తేదీతో ముగియనున్నది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చన్న వార్తలు గత ఏడాది కాలంగా చూస్తూనే వున్నాం. అసెంబ్లీని రద్దు చేస్తే రాష్ట్రంలో ప్రెసిడెంటు రూల్ పెట్టే ప్రమాదముందని గుర్తించడం వల్లనే ముందస్తు ఆలోచనను కేసీఆర్ వాయిదా వేశారని చాలా మంది భావిస్తున్నారు. ఈక్రమంలో మార్చి 10న జరగనున్న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఏఏ అంశాలపై చర్చిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంలో జరిగిన మర్నాడే కవిత ఈడీ విచారణను ఎదుర్కోబోతున్నారు. ఈక్రమంలో తెలంగాణలో స్వయంగా, మిగిలిన రాష్ట్రాలలో కలిసి వచ్చే పార్టీలతో కలిసి కేంద్రంపై పోరును ఉధృతం చేసేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తారని తెలుస్తోంది. పలు విపక్ష పార్టీలు ఇప్పటికే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను తమను ఇరుకున పెట్టేందుకు మోదీ సర్కార్ వినియోగించుకుంటుందని ఆరోపిస్తూనే వున్నారు. పలు రకాల ఆరోపణలతో ఈడీ, సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్న నేతలకు చెందిన పార్టీలు బీఆర్ఎస్ పోరాటంలో కలిసి వచ్చే అవకాశాలున్నాయి.
దూకుడు పెంచిన రేవంత్
బీఆర్ఎస్ కార్యకలాపాలు ఇలా వుంటే.. తెలంగాణపై విస్తృతస్థాయిలో పాదయాత్రకు పూనుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటల ధాటి పెంచారు. కేసీఆర్ ఫ్యామిలీ లక్ష్యంగా ఆయన పలు ఆరోపణలు చేస్తున్నారు. ఫిబ్రవరి తొలివారంలో రేవంత్ రెడ్డి ప్రారంభించిన హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మార్చి 9న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రేతోపాటు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ హాజరవుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ధరణి యాప్‌ను రద్దు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు మార్చి 10వ తేదీన దీనిపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనిని జైరాం రామేశ్‌తో కలిసి ఠాక్రే పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించనున్నారు. మార్చి 11వ తేదీన గాంధీభవన్‌లో టీపీసీసీ సోషల్ మీడియా వారియర్స్‌తో ఠాక్రే భేటీ అవనున్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేలా ప్రణాళిక రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే, కవిత విచారణపై టీపీసీసీ నుంచి భిన్నమైన ప్రకటనలు రావడం కొంత గందరగోళానికి దారితీసింది. ఓవైపు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉప్పూనిప్పూ అన్న రీతిలో పరిస్థితి వుంటే.. కాంగ్రెస్ నేతలు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు వేరువేరని నిరూపించేందుకే కవితను విచారణకు పిలిపిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటన చాలా మందిలో నవ్వులు పుట్టించడం విశేషం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దాకా తాము బీఆర్ఎస్ పార్టీకి దూరమన్న సంకేతాల్నించేందుకు కాంగ్రెస్ నేతలు ఈ తరహా ప్రకటనలు చేస్తూ వుండవచ్చు.
పోటీ దీక్షలతో బీజేపీ రెడీ
ఇదిలా వుంటే.. కవిత ఢిల్లీ దీక్షకు పోటీగా బీజేపీ కూడా దీక్షలకు పిలుపునిచ్చింది. ఢిల్లీ బీజేపీ అక్కడి లిక్కర్ స్కామ్ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పోటీ దీక్షకు పూనుకుంది. జంతర్ మంతర్‌లోనే దీక్ష చేస్తామంటూ అనుమతి కోరింది బీజేపీ ఢిల్లీ యూనిట్. ఇందుకు అనుమతి లభించినట్లే కనిపించినా చివరికి వేరే వేదిక చూసుకోమనడంతో ఢిల్లీ బీజేపీ దీక్ష వెన్యూ మారిపోయింది. ఇటు హైదరాబాద్ నగరంలోను బీజేపీ తెలంగాణలో లిక్కర్ దందాకు వ్యతిరేకంగా దీక్షకు ప్లాన్ చేసింది. బయటెక్కడా అనుమతి లభించకపోవచ్చన్న అనుమానంతో ముందు జాగ్రత్తగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే దీక్ష చేయబోతున్నరు తెలంగాణ నేతలు. సో.. మార్చి 10 ఓ దీక్షల దివస్‌గా పతాక శీర్షికలకు ఎక్కబోతోంది. నిజానికి దక్షిణాదిలో కర్నాటక తర్వాత తమకు ఎక్కువ అవకాశాలున్నయని భావిస్తున్న తెలంగాణపై బీజేపీ చాలాకాలంగా దృష్టి సారించింది. ఫిబ్రవరిలో బీజేపీ కీలక నేతలందరినీ ఢిల్లీకి పిలిపించుకుని మరీ వ్యూహరచన చేసింది బీజేపీ అధినాయకత్వం. ఆ తర్వాత ప్రతీ పదిహేను రోజులకోసారి తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహరచనపై వర్కౌట్ చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. ఈక్రమంలో మార్చి 11న కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రాబోతున్నారు. నిజానికి మార్చి 12న సంగారెడ్డి టౌనులో బహిరంగసభకు బీజేపీ నేతలు ముందుగా ప్లాన్ చేశారు. కానీ అమిత్ షా ప్రోగ్రామ్‌లో మార్పు కారణంగా దాన్ని రద్దు చేశారు. తాజా సమాచారం మేరకు మార్చి 11 రాత్రి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా.. ఆ రాత్రికే తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఆ తర్వాత పన్నెండవ తేదీన సీఆర్పీఎఫ్ కార్యక్రమానికి హాజరవుతారాయన. అనంతరం నేరుగా కేరళ పర్యటనకు వెళ్ళనున్నట్లు సమాచారం. మొత్తమ్మీద తెలంగాణ పాలిటిక్స్‌లో మార్చి 9,10,11,12 తేదీలు కీలకంగా కనిపిస్తున్నాయి.
