దురాజ్‌పల్లిలో భక్తి పారవశ్యం.. నేటి నుంచి పెద్దగట్టు లింగమంతుల జాతర.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆంక్షలు

తెలంగాణలోనే రెండో అతిపెద్ద దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఇవాళ ఘనంగా ప్రారంభం కానుంది. నేటి అర్థరాత్రి నుంచి మార్చి 4 వరకూ నిర్వహించనున్న జాతరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

  • Balaraju Goud
  • Publish Date - 7:50 am, Sun, 28 February 21
దురాజ్‌పల్లిలో భక్తి పారవశ్యం.. నేటి నుంచి పెద్దగట్టు లింగమంతుల జాతర.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆంక్షలు

peddagattu lingamanthula jatara : తెలంగాణలోనే రెండో అతిపెద్ద దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఇవాళ ఘనంగా ప్రారంభం కానుంది. నేటి అర్థరాత్రి నుంచి మార్చి 4 వరకూ నిర్వహించనున్న జాతరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు జాతర నేపథ్యంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు పూర్తి చేసిన పోలీసులు జాతీయ రహదారిపై ఆంక్షలు విధించారు.

యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు ప్రధాన ఆలయం రంగులతో అందంగా ముస్తాబైంది. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, గట్టు కింద భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులు పూర్తయ్యాయి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి పక్కనే దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టుపై లింగమంతుల స్వామి ఆలయం నెలకొని ఉంది.

సమ్మక్క, సారలమ్మల జాతర తర్వాత అతిపెద్దది.. లింగమంతుల స్వామి జాతర. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్‌ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు.

లింగమంతుల స్వామి జాతర తొలి ఘట్టం గంపల ప్రదక్షిణతో ప్రారంభం అవుతుంది. సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను యాదవ కులస్తులు ఊరేగింపుగా తీసుకువస్తారు. కాలినడకన బయలుదేరి దురాజ్‌పల్లిలో ఉన్న పెద్దగట్టుకు ఇవాళ రాత్రి చేరుకుంటారు. గంపలతో ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. మెంతబోయిన, గొర్ల, మున్న వంశస్తుల సమక్షంలో రెండు బోనాలు వండి పూజలు నిర్వహిస్తారు. రెండో రోజు సోమవారం చౌడమ్మకు బోనాలు, మొక్కులు సమర్పణ, మూడో రోజు మంగళవారం చంద్రపట్నం, నాలుగో రోజు బుధవారం నెలవారం, ఆతర్వాత ఐదోరోజు గురువారం మకర తోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుంది.

కాగా, పెద్దగట్టు జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం రూ.3.7 కోట్లను ఖర్చు చేశారు. జాతరకు ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా రూ. 2 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పాటు సూర్యాపేట మున్సిపాలిటీ, ఇతర శాఖలు రూ.1.7 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశాయి. కోవిడ్‌ నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు మున్సిపల్‌ యంత్రాంగం 600 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏడు అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 200 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో విధులు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.

ఈసారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో జాతర సందర్భంగా 65వ జాతీయ రహదారిపై భారీ వాహనాలను మళ్లిస్తున్నారు. ఫిబ్రవరి 28 మధ్యాహ్నం నుంచి మార్చి4 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాని జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా విజయవాడకు వెళ్లే వాహనాలు నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ వైపు మళ్లించనున్నారు. విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు కోదాడ వద్ద హుజూర్‌నగర్ మీదుగా మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి వైపు మళ్లించనున్నట్టు ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు.

ఇక జాతరకోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 40 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల నుంచి 70 బస్సులను జాతరకు ప్రత్యేకంగా నడపనున్నారు.

ఇదీ చదవండిః తాగి బండి నడిపి అడ్డంగా బుక్కైన మందుబాబులు.. శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా?