Telangana: 10 రోజుల్లో పంచాయతీ నోటిఫికేషన్..! రేవంత్ సర్కార్ ప్లాన్ సక్సెస్ అయ్యేనా..
తెలంగాణ కేబినెట్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించింది కేబినెట్. ఈ క్రమంలోనే స్థానిక సమరానికి ముహుర్తం ఖరారు చేసింది. అంతా సవ్యంగా జరిగితే.. వచ్చే పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 15లోపు మొత్తం ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించింది.

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే మొదట గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. మార్చి 31లోపు 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియనుండడంతో అప్పటిలోగా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. అలా కుదరకపోతే.. గ్రామాలకు రావాల్సిన దాదాపు రూ.3వేల కోట్ల నిధులు కోల్పోతామని భావిస్తోంది ప్రభుత్వం. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీ పరంగానూ 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తోంది. మంత్రివర్గ సమావేశంలో గ్రామీణ పాలనను పునరుద్ధరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు.. అధికారులు దీనిపై కసరత్తు ముమ్మరం చేశారు.. అంతా సవ్యంగా జరిగితే.. వచ్చే పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 15లోపు మొత్తం ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 23% బీసీ రిజర్వేషన్లను మొత్తం రిజర్వేషన్లు 50%కు లోపే ఉండేలా గ్రామాల వారీగా పునర్విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కమిషన్‌కు రిజర్వేషన్ల ఖరారుపై ఆదేశాలు పంపనుంది. ఈ ప్రక్రియకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా. కమిషన్ నివేదిక వచ్చేనాటికి రెండు–మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది.
బీసీలకు 42–60% పార్టీ వారీగా ..
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితం అయినప్పటికీ, పార్టీ తరఫున పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపికలో కనీసం 42% బీసీలను ఇవ్వాలని, అవసరమైతే 60% వరకు అవకాశమివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్‌లకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామీణ సంస్థలకు కేటాయించాల్సిన రూ.3,000 కోట్ల ఆర్థిక సంఘ నిధులు కోల్పోయే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వేగవంతమైన నిర్ణయం తీసుకుంది.
సుప్రీం, హైకోర్టు మార్గదర్శకాలతో..
రిజర్వేషన్లలో 50% పరిమితిని దాటకూడదన్న హైకోర్టు, సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంగా ప్రత్యేక కమిషన్‌నే రిజర్వేషన్ల ఖరారుకు బాధ్యుల్ని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 24న హైకోర్టు పరిశీలన అనంతరం వచ్చే క్యాబినెట్ సమావేశంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు.
డిసెంబర్ 8–9: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్
డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ సమ్మిట్ కోసం ప్రజాభవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న ప్రజాపాలనా విజయోత్సవాల ఏర్పాట్లను కూడా సమీక్షించారు.
తదుపరి క్యాబినెట్ సమావేశం ఈ నెల 29న జరుగుతుంది. ఇందులో సమగ్ర విద్యుత్ విధానంపై చర్చించనున్నారు.
జూబ్లీహిల్స్ గెలుపు.. మంత్రుల ధీమా
మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు విడిగా సమావేశమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వచ్చిన విజయంపై చర్చించారు. ఈ గెలుపు ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల చూపించిన విశ్వాసానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. బీసీలు, ముస్లింలు, సెటిలర్ల ఓటు బ్యాంక్ పార్టీకి మరింత బలం చేకూర్చుతోందని తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
