AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌! నేటి నుంచి ఆ ఛార్జీలు రద్దు..!

భారత బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే దిశగా RBI కీలక సంస్కరణలు ప్రకటించింది. ఇకపై బ్యాంక్ ఖాతాలకు నలుగురు నామినీలను జోడించుకోవచ్చు. క్రెడిట్ స్కోర్లు ప్రతి వారం అప్‌డేట్ అవుతాయి. ఫ్లోటింగ్ వడ్డీ రుణాలపై ముందస్తు చెల్లింపు ఛార్జీలు రద్దు చేయబడ్డాయి.

లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌! నేటి నుంచి ఆ ఛార్జీలు రద్దు..!
Loan India Copy
SN Pasha
|

Updated on: Apr 01, 2026 | 5:39 PM

Share

ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, వినియోగదారులకు అనుకూలంగా మార్చే దిశగా RBI కీలక సంస్కరణలను ప్రకటించింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు రుణగ్రహీతలు, బ్యాంకు ఖాతాదారులు, నగల వ్యాపారులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ వ్యవస్థలో వేగం, రుణ చెల్లింపుల సౌలభ్యం, ఆర్థిక భద్రతపై ఈ మార్పులు దృష్టి సారించాయి. కొత్త మార్పుల ప్రకారం.. బ్యాంకు ఖాతాలు, లాకర్లకు గరిష్టంగా నలుగురు నామినీలను జోడించుకునే అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ఉన్న పరిమితులను విస్తరించడం ద్వారా కుటుంబాలకు ఆర్థిక రక్షణ మరింత బలపడుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఆస్తుల బదిలీ ప్రక్రియ సులభతరం కావడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.

అదేవిధంగా క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ వ్యవస్థలో కూడా పెద్ద మార్పు తీసుకువచ్చారు. క్రెడిట్ స్కోర్లు ఇకపై నెలకొకసారి కాకుండా ప్రతి వారం అప్‌డేట్ అవుతాయి. ప్రతి నెల 7, 14, 21, 28 తేదీల్లో ఈ అప్‌డేట్‌ అవుతాయి. దీంతో రుణ చెల్లింపుల ప్రభావం వేగంగా కనిపించడమే కాకుండా, డిఫాల్ట్‌లు కూడా త్వరగా రికార్డవుతాయి. తమ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరచాలని చూస్తున్న వారికి ఇది కీలక ప్రయోజనం అందించనుంది. ఇంకా ఒక ముఖ్యమైన నిర్ణయంగా ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో ఉన్న రుణాలపై ముందస్తు చెల్లింపు లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేశారు. గృహ, కారు, విద్యా, వ్యక్తిగత రుణాలకు ఇది వర్తించనుంది. ఈ చర్యతో రుణగ్రహీతలు అదనపు ఖర్చుల భయం లేకుండా తమ రుణాలను ముందుగానే ముగించుకునే అవకాశం పొందుతారు.

ఇక నగల వ్యాపారులకు కూడా ఉపశమనం లభించింది. బంగారు లోహ రుణాల (GML) తిరిగి చెల్లించే గడువును 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచారు. దీంతో నగదు ప్రవాహ నిర్వహణలో వ్యాపారులకు మరింత సౌలభ్యం కలుగుతుంది. మొత్తంగా ఈ సంస్కరణలు భారత బ్యాంకింగ్ రంగంలో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా, రుణ వ్యవస్థను మరింత సరళంగా, సమర్థవంతంగా మార్చే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us