Telangana: వల బరువెక్కడంతో పెద్ద చేప చిక్కిందనుకున్నారు.. ఆత్రంగా పైకి లాగగా.. దెబ్బకు షాక్!
నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో కొందరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. నీటిలోకి వల వేయగా.. కొద్దిసేపటికి అది బరువెక్కింది.
నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో కొందరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. నీటిలోకి వల వేయగా.. కొద్దిసేపటికి అది బరువెక్కింది. ఏదో పెద్ద చేపే చిక్కిందనుకున్నారు. ఎంతో సంబరపడిపోయి.. వలను పైకి లాగారు. ఇంతకీ చూస్తే అదొక మూట. ఇక అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు షాకయ్యారు. ఆ మూటలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మృతదేహం దొరికింది. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..!
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడు లావుడి తండాకు చెందిన ధారవత్ రాగ్యకు పెద్దవూర మండలంకు చెందిన రోజాతో 2010లో వివాహమైంది. హైదరాబాద్‌లో నివాసముంటున్న వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కడే వరుసకు బావైన లకపతితో రోజాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో భార్యాభర్తలు పలుమార్లు ఘర్షణ పడ్డారు. ఇక తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని భార్య రోజా పక్కా స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా బుగ్గతాండకు చెందిన మాన్సింగ్, బాలాజీతో 20 లక్షల సుపారి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నాడు లకపతి.
గత ఏడాది ఆగస్టు 19న హైదరాబాద్ నగర శివారులో మద్యం తాగించి రాగ్యను హత్య చేశారు. అనంతరం నెరేడుగొమ్ము మండలం కాసరాజపల్లి పుష్కరఘాట్ సమీపంలో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో రాగ్య మృతదేహాన్ని పడేశారు సుపారి నిందితులు. ఆ తర్వాత రాగ్య కనిపించడం లేదంటూ.. అతడి తల్లిదండ్రుల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భార్య ఫోన్ కాల్‌డేటా ఆధారంగా విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకుని రాగ్య మృతదేహం కోసం నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో పోలీసులు మూడు రోజులపాటు వెతికారు. మృతదేహం లభించకపోవడంతో ఆశ వదులుకున్నారు.
అయితే ఘటన జరిగిన ఎనిమిది నెలల తర్వాత.. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ మూట చిక్కింది. ఓపెన్ చేసి చూడగా అందులో మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. డీఎస్‌ఏ ఆధారంగా ఆ మృతదేహం రాగ్యాదిగా గుర్తించారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. బంధువులకు అప్పగించారు. దీంతో పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించి నట్లైయింది.