Telangana: మోదీ ఫెయిల్యూర్ పీఎం.. ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారు.. మంత్రి వేముల షాకింగ్ కామెంట్స్..
దేశ ప్రధానిగా మోడీ పెయిల్ అయ్యారని రాష్ట్ర మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించిన ఆయన.. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజలను దోచుకుంటున్నారని..

దేశ ప్రధానిగా మోడీ పెయిల్ అయ్యారని రాష్ట్ర మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించిన ఆయన.. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా రూరల్ మండలం దానవాయిగూడెం నుంచి పాపటపల్లి వరకు రూ. 33 కోట్లతో నిర్మాణం చేయనున్న బీటీ రహదారి పనులకు రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రామన్నపేటలో జరిగిన బహిరంగ సభలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందంజలో ఉందన్నారు. అబద్ధపు మాటలతో బీజేపీ నాయకులు రాష్ట్రంలో సంచరిస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఎదుర్కోలేక అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎంతో నమ్మకం ఉందని, రానున్న ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి గెలుపును ఎవరు ఆపలేరన్నారు ప్రశాంత్ రెడ్డి అన్నారు.
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధితో నియోజకవర్గ స్వరూపం మారిపోయిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వినూత్న పథకాలు తీసుకొచ్చారన్నారు. మొన్నటి వరకు చెప్పుకున్న గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ కావడంతో దాన్ని తీసేసి డబుల్ ఇంజన్ మోడల్‌ను తీసుకొచ్చారని అజయ్ విమర్శించారు. భద్రాచలం వద్ద జాతీయ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణం తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఏపనైనా పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం పట్టదని మంత్రి చెప్పారు. తెలంగాణ వచ్చాక ఖమ్మం జిల్లాకు అత్యధిక నిధులు తీసుకొచ్చామని, రానున్న ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి10 కి 10 సీట్లు గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
