Telangana: అది కాదని నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా.. బీజేపీ తెలంగాణ ఎంపీలకు మంత్రి కేటీఆర్ సవాల్..!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎంపీలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ సొమ్ముతో కేంద్రం కులుకుతోందని, తెలంగాణ కట్టిన పైసలతో వెనుకబడిన బీజేపీ పాలిత ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటోందన్న కేటీఆర్..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎంపీలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ సొమ్ముతో కేంద్రం కులుకుతోందని, తెలంగాణ కట్టిన పైసలతో వెనుకబడిన బీజేపీ పాలిత ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటోందన్న కేటీఆర్.. కాదని నిరూపిస్తే ఈక్షణమే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఉద్యమంలో కూడా భాగస్వామి కాలేని కిషన్ రెడ్డి.. కనీసం తెలంగాణకు ధన్యవాదాలు చెప్పాలని సూచించారు మంత్రి కేటీఆర్.
శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. తొలుత సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన కేటీఆర్.. బీజేపీ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సొమ్ముతోనే కేంద్రం కులుకుతోందని ఆయన విమర్శించారు. ఇక్కడ కట్టే పన్నులను ఉత్తర భారతదేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది నిజమా? కాదా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఉద్యమంలో కూడా భాగస్వామి కాలేని కిషన్ రెడ్డి కనీసం ధన్యవాదాలైనా చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారని కేటీఆర్ చెప్పారు. బీజేపీ నేతలు మత రాజకీయాలకు, నీతిలేని రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
చండూరు మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 70 కోట్లతో చండూరు మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండాలి అనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే రెట్టింపు అభివృద్ధి పనులు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యని శాశ్వతంగా తీర్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
