AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assemly: దుమ్ముదుమారమే..! అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. మంత్రి శ్రీధర్‌బాబు ఏమన్నారంటే..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.. నదీ జలాల పంపిణీ, పాలమూరు ప్రాజెక్ట్‌లపై చర్చ జరిగే అవకాశం ఉంది.. అయితే.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే హాట్‌టాపిక్‌గా మారాయి.. ఇందుకు కారణం అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరవుతారని ప్రచారం.. కేసీఆర్‌ అటెండ్‌ అవుతారా? లేదా?అనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.

Telangana Assemly: దుమ్ముదుమారమే..! అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. మంత్రి శ్రీధర్‌బాబు ఏమన్నారంటే..
BRS Chief KCR - Telangana CM Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Dec 28, 2025 | 7:30 PM

Share

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29 2025) నుంచి ప్రారంభం కాబోతున్నాయి.. అయితే.. ప్రారంభానికి ముందే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారనే ప్రచారం.. అయితే.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరవుతారా?.. లేదా?.. అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల బీఆర్ఎస్‌ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్‌.. ఆ తర్వాత.. ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నదీ జలాల పంపిణీ, పాలమూరు ప్రాజెక్ట్‌ల విషయంలో రేవంత్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరో అడుగు ముందుకేసి.. ఇక నుంచి లెక్క మరోలా ఉంటుందంటూ కేసీఆర్‌ హెచ్చరించడం రాజకీయంగా కాక రేపింది.

కేసీఆర్‌ కామెంట్స్‌పై రియాక్ట్‌ అయిన సీఎం రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఆధారాలతో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే.. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరవుతారనే టాక్‌ నడుస్తోంది. దీంతో.. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. డే వన్‌ నుంచే హీట్‌ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక… అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరుపై మంత్రి శ్రీధర్‌బాబు రియాక్ట్‌ అయ్యారు. ఆయన సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని.. అసెంబ్లీలో రాజకీయాలు చేస్తామంటే మాత్రం ధీటుగా సమాధానం ఇస్తామన్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. మొత్తంగా కేసీఆర్ హాజరైతే తొలిరోజే అసెంబ్లీ సమావేశాలు హీటెక్కనున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ టీమ్ రెడీ..

మరోవైపు అసెంబ్లీ వేదికగా విపక్షాల విమర్శలన్నింటికీ కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ టీమ్ రెడీ అయింది. ఇప్పటికే మంత్రులంతా ఆయా శాఖల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలలో ప్రధానంగా కృష్ణా, గోదావరి జలాలు.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పధకంపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. నీటిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు సర్కార్ ప్లాన్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు నీళ్ల విషయంలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తామంటోంది అధికార పార్టీ. కేసీఆర్ ఆరోపణలన్నింటికీ కౌంటర్ ఇస్తామంటోంది. ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చేస్తున్న కృషిని వివరించనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..