Andhra Pradesh: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..!
ఏపీలో చిన్న పిల్లల సోషల్ మీడియా వాడకంపై ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ విధించనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను 90 రోజుల్లో ఖరారు చేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇదే సమయంలో 13 -16 లోపు పిల్లలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలవుతున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.పిల్లల మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేస్తుండగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో పయనించనుంది. దీనికి సంబంధించి 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇదే సమయంలో 13 -16 లోపు పిల్లలకు సంబంధించి సోషల్ మీడియా వాడకంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ అంశంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పటికే పార్లమెంటులో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. చిన్న పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టడానికి జాతీయ స్థాయిలో చట్టం రావాలని ఆయన ఆకాంక్షించారు.
నిషేధం వెనుక ఉన్న ప్రధాన కారణాలు
చిన్న వయస్సులోనే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తున్నాయి. మొబైల్ ఫోన్లలో గంటల తరబడి గడపడం వల్ల విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. వడపోత లేని సోషల్ మీడియాలో పిల్లలు హానికరమైన, హింసాత్మకమైన కంటెంట్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. తెలియని వ్యక్తులతో పరిచయాలు, సైబర్ బుల్లింగ్ వంటివి పిల్లల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి.
కాగా పిల్లల్లో మొబైల్ వ్యసనాన్ని అరికట్టడం ద్వారా వారిని తిరిగి ఆటపాటలు, పుస్తక పఠనం వైపు మళ్లించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనిపై విద్యావేత్తలు, మనస్తత్వ నిపుణులతో చర్చించి అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.
