Andhra: కలివికోడి కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు.. కానీ, పెద్ద స్కామే జరిగింది..
అదో అరుదైన పక్షి.. ఆ పక్షి జాడ అంతరించిపోయిందని పక్షి ప్రేమికులు భావిస్తున్న తరుణంలో.. మళ్ళీ ఆ పక్షి జాడ కనిపించింది.. పక్షి ప్రేమికుల్లో ఆశలు చిగురించాయి.. ఆ పక్షి సంరక్షణ కోసం వందల కోట్లు నిధులు విడుదల చేసింది.. దీన్ని అదునుగా భావించి కోట్లు కాజేసేందుకు ప్లాన్ వేశారు.. అదే ప్రాజెక్ట్ పేరిట మళ్ళీ ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు కొందరు నేతలు.. ఈ న్యాయవాదినే బెదిరింపులకు దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించడంతో సంచలన వాస్తవాలు వెలుగు చూశాయి..

కలివికోడి ఇది అత్యంత అరుదైన పక్షి. అంతరించి పోతున్న జీవుల జాబితాలోకి ఈ పక్షి చేరుతున్న క్రమంలో మళ్ళీ లంకమల్ల అటవీ ప్రాంతంలో పక్షి జాడ కనిపించింది. అంతరించిపోతున్న ఆ పక్షిని కనుగొన్న అట్లూరు ప్రాంతానికి చెందిన ఐతన్నకు అటవీ శాఖలో ఉద్యోగం కూడా ఇచ్చారు. దీంతో పక్షి ప్రేమికుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి.. 1848లో జెర్డాన్ ఈ పక్షిని కనుగొన్నాడు. ఇంగ్లీషులో దీన్ని జెర్డాన్స్ కోర్సర్ అని అంటారు. దీని శాస్త్రీయ నామం – రినోప్టిలస్ బైటర్క్వేటస్.. భారత ప్రభుత్వ “అటవీ జంతు సంరక్షణ చట్టం 1972” కింద ఈ పక్షి సంరక్షించబడింది. పక్షి జాడ లంకమల్లలో లభ్యం కావడంతో అత్యధిక నిధులను కేటాయించి సంరక్షణ చర్యలను చర్యలు చేపట్టింది. ఇందుకోసం వందల కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాత్రి వేళల్లో మాత్రమే కనిపించే పక్షి ఆనవాళ్ళ కోసం లంకమల్ల అటవీ ప్రాంతంలో 117సీసీ కెమెరాలను కూడా అమర్చారు.. కలివికోడి కూతను కూడా రికార్డు కూడా చేశారు. అంతే కాదు ఆ ప్రాంతం గుండా వచ్చే తెలుగు గంగ కాల్వ పనులను సైతం రద్దు చేశారు.. పేలుళ్ల, శబ్దల వల్ల పక్షి జాడ మళ్ళి కనుమరుగయ్యే పరిస్థితి ఉందని భావించి వైఎస్ హయాంలో తెలుగు గంగ కుడి కాల్వ పనులను రద్దు చేసి సంరక్షణ పై దృష్టి పెట్టారు..
ఈ క్రమంలోనే అట్లూరుకు సమీపంలో కలివికోడి రక్షణ పార్కు ఏర్పాటు చేశారు.. దీన్ని అదునుగా భావించి కొందరు నేతలు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చూపించి కోట్లు కాజేశారు.. భూమిలో చెట్లకు, బోర్లకు, నిర్మాణాలకు పరిహారం చెల్లించలేదని కోర్టును ఆశ్రయించి కోట్ల రూపాయల పరిహారాన్ని కాజేశారు.. గుజ్జల సరోజమ్మ పేరును దుంపల సరోజమ్మగా భర్త రాజారెడ్డి పేరును సైతం మాధవయ్యగా మార్చి పరిహారం పేరిట కోట్లు వెనకేసుకున్నారు. మరో మహిళ నాగేళ్ల పార్వతమ్మ అయితే ఎం పార్వతమ్మగా భర్త పెద్ద సుబ్బారెడ్డి అయితే సుబ్బారెడ్డిగా మార్చి కోర్టును ఆశ్రయించి పరిహారం బొక్కేసారు.
ఇక ఆధార్ కార్డులను సైతం మార్చి పరిహారం పొందారు.. కంభం వెంకట్రామిరెడ్డి, డంపాల నరసింహారెడ్డి పేర్లతో వేర్వేరు ఫొటోలతో కార్డులు సృష్టించి కోర్టు ఆదేశాల మేరకు ఆర్ధిక శాఖ నుంచి 2కోట్ల 39లక్షల 4వేల 522రూపాయలు పరిహారం పొందారు.. పరిహారం చెల్లింపు ఆలస్యానికి అదనంగా అంటే వడ్డీగా 70లక్షలు తీసుకున్నారు.. ఇది సరిపోలేదన్నట్లు అదనపు పరిహారం కోసం మళ్ళీ హై కోర్టును ఆశ్రయించారు.. దీంతో న్యాయవాదులకు అనుమానం వచ్చింది.. వివరాలన్నీ ఆరా తీయ్యడంతో మోసాలు వెలుగులోకి వచ్చాయి..
సీఎంఎఫ్ఎస్ క్రింద ఆర్ధిక శాఖ పరిహారం చెల్లింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు న్యాయస్థానానికి నివేదించడంతో విచారణకు ఆదేశించారు. పరిహారంలో అలియాస్ అనే పదానికి చోటే లేదని తేల్చి చెప్పాయి. ఒకే ఆధార్ కార్డు నెంబర్ పై రెండు కార్డులు సృష్టించడం వాటిల్లో వేర్వేరు ఫోటోలు ఉండటంపై విచారణకు ఆదేశించారు. బ్యాంకు ఖాతా దండాల నరసింహారెడ్డిపేరిట ఉండగా జీ ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ కలెక్టర్ మాత్రం కంభం వెంకట్రామిరెడ్డి పేరిట పరిహారం చెల్లింపులకై సిపార్సు చెయ్యడం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి..
భూముల్లో ఎలాంటి నిర్మాణాలు లేనప్పటికి పరిహారం..
భూముల్లో ఎలాంటి నిర్మాణాలు, చెట్లు లేకపోయినా పరిహారం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.. ఆర్డీవో ఇచ్చిన నివేదికకు విరుద్ధంగా ఇంజనీరింగ్, అటవీ ఉద్యాన వన శాఖలు నివేదిక సమర్పించడంపై పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి తంబలగొండి గ్రామ ఓటర్ల జాబితాను పరిశీలించగా కంభం వెంకట్రామిరెడ్డి లేనట్లు తెలుస్తుందని నివేదించారు.. 2021లో భూసేకరణ అధికారి సమర్పించిన ఫారం-సీలో జత చేసిన ఫోటో 2017నాటికి 75సంవత్సరాల వ్యక్తికి సరిపోలేదని నివేదికలో పేర్కొన్నారు.. ఏది ఏమైనా ఈ దందా వెనుక భారీ ప్రణాళిక ప్రకారం కోట్లు కాజేసే కుట్ర దాగి ఉందన్నది అక్షర సత్యమని స్థానికులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
