Telangana: మంత్రి పుట్టిన రోజు.. ఓ వ్యక్తి చేసిన పనికి ఊరు ఊరంతా సంబరపడింది
ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల అభిమానులను చూశాం.. కొందరు తమకు నచ్చిన హీరోలు, సెలబ్రిటీలను, నాయకులను చాలా ఇష్టపడుతుంటారు. ఆరాధిస్తుంటారు.. కొందరు తను అభిమానించే వారి ఫోటోను ట్యాటుగా వేసుకుంటారు. మరికొందరెమో హెర్ స్టైల్ మార్చుకుంటారు. తాజాగా అలాంటి సంఘటననే ఒక్కటి జరిగింది.
పుట్టినరోజు వివాహ శుభకార్యాలు జరిగే సమయంలో గిఫ్ట్ ఇచ్చి (బహుమతులిచ్చి) శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. అదే రాజకీయ నాయకుడు,లేదా అభిమాన నాయకుడు పుట్టినరోజు వేడుకైతే ఆ అభిమాన నాయకుడి రూపాన్ని తన గుండెలపై గీయించుకుంటూ ఉంటారు. తమ నాయకుడి పై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తెలియజేస్తారు. ఈ తరహాలోనే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన చిలక బత్తిని రామారావు అనే వ్యక్తి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై ఉన్న అభిమానంతో అభిమాన నేత పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో వేడుకలు నిర్వహించి గ్రామానికి ఓ గిఫ్ట్ ఇచ్చాడు అది ఇప్పుడు ఈ ప్రాంతంలో ఆసక్తికరంగా మారింది.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన రామారావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వీర అభిమాని.. మంత్రి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశాడు. పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి పుట్టినరోజు పురస్కరించుకొని గ్రామానికి తాను సొంతగా ఓ ఆంబోతును కానుకగా ఇచ్చాడు. ఆంబోతును గ్రామానికి కానుకగా ఇచ్చి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆంబోతుకు పూజలు నిర్వహించారు. గతంలో ఆ గ్రామంలో ఆంబోతు ఉండేది, అది ఈ మధ్యకాలంలో చనిపోయింది. దీంతో రామారావును పలువురు అభినందించారు.