Minister KTR: బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ.. నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
చిల్లర రాజకీయాలు చేస్తూ.. దేశంలో చిచ్చు పెట్టి, నాలుగు ఓట్లు వేయించుకోవాలని బీజేపీ ఆలోచన అని మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు.
Minister KTR fire on BJP: చిల్లర రాజకీయాలు చేస్తూ.. దేశంలో చిచ్చు పెట్టి, నాలుగు ఓట్లు వేయించుకోవాలని బీజేపీ ఆలోచన అని మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నామని, బండి సంజయ్‌కు.. జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదన్నారు. బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదన్నారు. అంతా చిల్లర రాజకీయం చేస్తూ.. దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బీజేపీ ఆలోచనగా ఉందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వామ్య పక్షాలు ఎవరు అంటే బీజేపీ, ఈడీ, సీబీఐ, ఐటీలే అన్నారు. ఢిల్లీలో కొంత మీడియా మోడీయాగా మారిందని దుయ్యబట్టారు.
జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ పట్ల జేపీ నడ్డా వ్యాఖ్యలు హేయంగా ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గతంలో గూండాగిరి ఉండేదని చెబుతున్నారు. యూపీలో ఇప్పుడు గూండాగిరి లేనందుకు ఓటేయాలని కోరుతున్నారు. సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారని కేటీఆర్ ఫైరయ్యారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోడీ.. రైతు విరోధిగా మారారన్నారు. పంజాబ్‌లో ప్రధాని మోడీని రైతులు అడ్డుకున్నారు. రైతులు అడ్డుకుంటే 20 నిమిషాలు మోడీ రోడ్డుపై ఉన్నారు. 2022 కల్లా ప్రతి భారతీయుడికి ఇళ్లు అని మోడీ చెప్పారు. ఇప్పటివరకు ప్రతి భారతీయుడికి ఇల్లు వచ్చిందా? తెలంగాణ సహా 28 రాష్ట్రాల ప్రజలకు ఇళ్లు అనే హామీ కూడా ఉత్తదే అన్నారు.
సీఎం కేసీఆర్ గురించి జేపీ నడ్డా ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్న కేటీఆర్.. జేపీ నడ్డా.. అబద్ధాల అడ్డా.. కేరాఫ్ ఎర్రగడ్డ అన్నారు. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ప్రయోగిస్తారని ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్రమే పార్లమెంటులో చెప్పింద్న కేటీఆర్.. మోడీ హయాంలో సామాన్యుడికి శోకం మాత్రమే మిగిలిందన్నారు. రైతుబంధు నకలు కొట్టి కిసాన్ సమ్మాన్ నిధి తీసుకువచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రైతుబంధు స్పూర్తి కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. హర్ ఘర్ జల్ స్ఫూర్తి మిషన్ భగీరథ కాదా? మిషన్ భగీరథ నీళ్లు కేసీఆర్ ఇల్లు, ఫామ్‌హౌస్‌కే వెళ్తున్నట్లు ఆరోపిస్తున్నారు మిషన్ భగీరథ గొప్ప పథకమని కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించిన విషయం మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ రైతులు పండించిన పంటను కొనలేమని ఎఫ్‌సీఐ చేతులెత్తేసింది. నీతి ఆయోగ్‌కు ఉన్న నీతి కూడా నడ్డాకు లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతుబంధు, రైతుబీమా తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్న కేటీఆర్.. రాష్ట్ర పథకాలను నకలు కొట్టిన దౌర్భాగ్య పరిస్థితి బీజేపీది అన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన అని విమర్శలు చేస్తున్నవారికి, ఉద్యమంలో పాల్గొన్నవారికి పాలించే అవకాశం లేదా అని ప్రశ్నించారు. బీజేపీలో కుటుంబపాలన గురించి ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించిన కేటీఆర్.. అమిత్‌షా కుమారుడికి బీసీసీఐ పదవి ఎలా వచ్చిందన్నారు. కుటుంబ పాలన అంటూ నడ్డా మాట్లాడటం విడ్డూరమన్న మంత్రి.. జేపీ నడ్డా అత్త జయశ్రీ బెనర్జీ మంత్రిగా లేరా?.. దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.