Telangana: బాబు అలా అనడం విడ్డూరంగా ఉంది.. లెక్కలతో కడిగేసిన హరీశ్ రావు

తెలంగాణ ప్రజలు తన వల్ల ఇవాళ అన్నం తింటున్నట్లు చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి హరీశ్. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి....

Telangana: బాబు అలా అనడం విడ్డూరంగా ఉంది.. లెక్కలతో కడిగేసిన హరీశ్ రావు
Minister Harish Rao
Follow us

|

Updated on: Mar 03, 2023 | 5:19 PM

తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువయ్యేంత పంట పండుతుందని.. ఈ యాసంగిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే, తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షలు ఎకరాలలో వరి సాగు చేశామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ ప్రజలు జొన్న, గట్క, మక్క తప్ప ఏమీ తినలేదని, ఇవాళ తన వల్ల అన్నం తింటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం విడ్డురంగా ఉందని హరీశ్ విమర్శించారు.

సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన జగదేవ్ పూర్ బస్టాండులో చాట్లపల్లి సర్పంచ్-రాచర్ల రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి గ్రేస్ బాల్-క్రికెట్ టోర్నమెంట్ విజేత, రన్నరప్‌లకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ కారణజన్ముడని, చరిత్రను తిరగ రాశారని, కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌లకు నీళ్లు వచ్చేవి కావని వివరించారు.

తైవాన్ దేశం నుంచి హాక్సన్ కంపనీ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ గారిని కలిస్తే తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధిపై ప్రజంటేషన్ ఇచ్చారని వెల్లడించారు. ఏడేండ్లలో అబ్బురపోయేలా అభివృద్ధి సాధనపై కేసీఆర్ విజన్ చూసి వారు ఆశ్చర్యపోయారని తెలిపారు. తైవాన్ వచ్చి తమ ప్రభుత్వానికి ఈ పద్దతులను వివరించాలని తైవాన్ దేశ ప్రతినిధులు కోరారని, ఇది తమకు ఎంతో సంతోషం కలిగిందన్నారు హరీశ్. గుక్కెడు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ ఈ గడ్డపై ఇవాళ మండుటెండలో చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయని సంబురం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక-పర్యాటక సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ రెడ్డి, ఇతర మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం