AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchayat Elections 2024: త్వరలోనే ‘స్థానిక’ ఎన్నికల నగారా.. అమీతుమీకి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు..

వార్డులవారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితాను సెప్టెంబరు 6న ప్రకటిస్తారు. 7నుంచి 13వ తేదీదాకా ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 21న తుది ఓటర్ల జాబితాను వార్డులవారీగా ప్రకటిస్తారు.

Panchayat Elections 2024: త్వరలోనే 'స్థానిక' ఎన్నికల నగారా.. అమీతుమీకి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు..
KCR - Revanth Reddy - Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Sep 01, 2024 | 11:59 AM

Share

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మారిపోయింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలిపోయింది. తెలంగాణలో ప్రధాన పార్టీలు రెండ్నెల్లలో మరో అగ్నిపరీక్షకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు ఎస్ఈసీ పార్థసారధి. ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇప్పటికే వార్టుల వారీగా ఓటర్ల జాబితా తయారీ తుది దశకు చేరుకోవడంతో పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు ఆహ్వానించారు. వార్డులవారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితాను సెప్టెంబరు 6న ప్రకటిస్తారు. 7నుంచి 13వ తేదీదాకా ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 21న తుది ఓటర్ల జాబితాను వార్డులవారీగా ప్రకటిస్తారు.

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి ఏడు నెలలు గడిచిపోయింది. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల వివరాలు అందిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాబోతోంది. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబరు మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీలు భావిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంకావాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు. ముందుగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. మొత్తానికి పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కాస్త రిలాక్స్‌ అయిన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగగానే మళ్లీ ప్రజల్లోకి వెళ్లబోతున్నాయి.

మూడు ప్రధానపార్టీలకు ప్రతిష్టాత్మకం..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు ప్రధానపార్టీలకు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్‌ స్థానిక సంస్థల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. రుణమాఫీ కార్యక్రమంతో పాటు సంక్షేమ పథకాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కలిసొస్తాయన్న ధీమాతో ఉంది అధికారపార్టీ. అధికారంలోకి రాగానే స్థానికసంస్థల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌.. వచ్చే ఎన్నికలను ఇజ్జత్‌కా సవాల్‌గా భావిస్తోంది. రేవంత్‌రెడ్డి నాయకత్వానికి రెఫరెండంలా మారబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటిన బీఆర్‌ఎస్‌ పట్టు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్‌లో సత్తాచాటిన కారుపార్టీ.. గ్రామీణప్రాంతాల్లోనూ తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటోంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమిభారాన్ని స్థానిక సంస్థల్లో దించుకోవాలన్న వ్యూహంతో ఉంది బీఆర్‌ఎస్‌.

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బలం పుంజుకున్న బీజేపీకి కూడా స్థానికసంస్థలు సవాలుగా మారబోతున్నాయి. క్షేత్రస్థాయిలోనూ బలం ఉందని నిరూపించుకోవాలంటే స్థానిక సంస్థల్లో కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. ఒకరికిద్దరు కేంద్రమంత్రులున్నా పార్టీ రాష్ట్ర సారథిపై నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలుకావటంతో త్వరగా కొత్త అధ్యక్షుడెవరో తేలిస్తే ఎన్నికలకు సిద్ధంకావచ్చంటోంది ఆ పార్టీ కేడర్‌. మొత్తానికి తొమ్మిదినెలల గ్యాప్‌ తర్వాత మళ్లీ తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలుకాబోతోంది. గల్లీదాకా పార్టీజెండా ఎగిరే ఎన్నికలు కావటంతో మూడు ప్రధానపార్టీలకూ అత్యంత కీలకం కాబోతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..