AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఫీజు చెల్లించలేదని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అపొద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

విద్యార్థులు ఫీజు చెల్లించలేదని కొన్ని కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపివేస్తున్నాయి. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులకు ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్లను వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు హైకోర్టులను ఆశ్రయించడంతో.. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Telangana: ఫీజు చెల్లించలేదని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అపొద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..
Students
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Sep 23, 2026 | 4:09 PM

Share

ఫీజులు బకాయి ఉన్నాయనే కారణంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యం వద్దే ఉంచుకోవడంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌ నల్లకుంటలోని జాహ్నవి డిగ్రీ కాలేజీ ఇద్దరు విద్యార్థుల ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌ కుమార్‌ సెప్టెంబర్‌ 18న ఆదేశాలు జారీ చేశారు. జాహ్నవి డిగ్రీ కాలేజీలో చదివిన ఇద్దరు విద్యార్థులు తెలంగాణ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TG CPGET) 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని భావించారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. అయితే.. ఫీజులు బకాయి ఉన్నాయనే కారణంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వలేదని వారు కోర్టును ఆశ్రయించారు. సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వ్యవహారంపై విచారణ సందర్భంగా విద్యార్థుల సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని కోర్టు గతంలోనే ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఆ ఆదేశాలను కాలేజీ యాజమాన్యం అమలు చేయలేదని విద్యార్థుల తరఫు న్యాయవాది తెలిపారు. కోర్టు ఉత్తర్వులను కాలేజీ యాజమాన్యానికి అందజేసేందుకు రెండు వేర్వేరు సందర్భాల్లో ప్రయత్నించినప్పటికీ.. వారు వాటిని స్వీకరించడానికి, అమలు చేయడానికి నిరాకరించారని కోర్టుకు వివరించారు. మరోవైపు ఉన్నత విద్యాశాఖ తరఫు న్యాయవాది ఈ వ్యవహారంపై కోర్టుకు వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయవద్దని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే కాలేజీలకు సూచనలు జారీ చేసిందని తెలిపారు.

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఇద్దరు విద్యార్థుల ఒరిజినల్‌ విద్యా ధ్రువపత్రాలను తిరిగి ఇవ్వాలని జాహ్నవి డిగ్రీ కాలేజీని ఆదేశించింది. విద్యార్థులు తమ ఉన్నత విద్యా అవకాశాలను కొనసాగించేందుకు అవసరమైన సర్టిఫికెట్లు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది.

Follow Us