Hyderabad: బొద్దింకలు, ఎలుకల వ్యర్థాల నడుమ వంటలు.. 700 కిలోల కుళ్లిన ఫుడ్ ధ్వంసం.. 8 క్లౌడ్ కిచెన్లపై చర్యలు..
స్మార్ట్‌ఫోన్‌లో అందమైన ఫోటోలు, ఫైవ్ స్టార్ రేటింగ్‌లు చూసి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మిమ్మల్ని ఖచ్చితంగా ఉలిక్కిపడేలా చేస్తుంది. భాగ్యనగరంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రముఖ క్లౌడ్ కిచెన్లు, హోటళ్ల గుట్టును TG SAFE అధికారులు రట్టు చేశారు. బొద్దింకలు తిరుగుతున్న వంటగదులు, ఎలుకల వ్యర్థాల నడుమ తయారుచేస్తున్న వంటకాలు, కుళ్లిన ఆహార పదార్థాలను చూసి అధికారులే నివ్వెరపోయారు.

హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ ఫుడ్ ప్రియుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న క్లౌడ్ కిచెన్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రజలకు అపరిశుభ్ర ఆహారాన్ని సరఫరా చేస్తున్న ప్రముఖ సంస్థలపై తెలంగాణ స్టేట్ యాంటీ ఫుడ్ కల్తీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మెరుపు దాడులు చేశాయి. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, ఖైరతాబాద్ వంటి ఐటీ కారిడార్ సహా పలు కీలక ప్రాంతాల్లో చేపట్టిన ఈ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 8 ప్రముఖ క్లౌడ్ కిచెన్లు, హోటళ్ల లైసెన్సులను అధికారులు తక్షణమే సస్పెండ్ చేసి, వాటి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయించారు.
24 బృందాలతో విస్తృత సోదాలు.. కిచెన్లలో దారుణ పరిస్థితులు..
ఆహార భద్రతా అధికారులు, నగర పోలీసులతో కలిపి మొత్తం 24 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఒకేసారి నగరంలోని 23 హోటళ్లు, ప్రముఖ క్లౌడ్ కిచెన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వంటగదుల దుస్థితిని చూసి అధికారులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. పాడైపోయిన ముడిసరుకులు, గడువు ముగిసిన నిల్వ పదార్థాలు. వంటగదుల్లో తిరుగుతున్న బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు. శాఖాహార, మాంసాహార పదార్థాలను నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఫ్రీజర్‌లో కుక్కి ఉంచడం. పూడుకుపోయిన డ్రైనేజీ వ్యవస్థలు, జిడ్డుపట్టిన ఎగ్జాస్ట్‌లు, ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా పనిచేస్తున్న సిబ్బంది.
లైసెన్సులు సస్పెండ్ అయిన 8 సంస్థలు ఇవే.
ప్రజారోగ్యాన్ని తీవ్రంగా పణంగా పెడుతున్న 8 వ్యాపార సంస్థల లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
- బిర్యానీ బై కిలో
- కుల్చా కల్చర్
- లక్కీ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్
- టమ్ యమ్ ఇన్నోవిజన్స్
- జోరా 11 బై 2
- ఎల్‌ఓ ఫ్రెష్ ఫుడ్స్
- ఐటీసీ ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్ క్లౌడ్ కిచెన్
- సోడెక్సో ఇండియా సర్వీసెస్
700 కిలోల కుళ్లిన ఆహారం ధ్వంసం.. మరో 10 సంస్థలకు నోటీసులు
తనిఖీల సందర్భంగా దాదాపు 700 కిలోల కుళ్లిన, నాణ్యత లేని కలుషిత ఆహార పదార్థాలను అధికారులు అక్కడికక్కడే సీజ్ చేసి ధ్వంసం చేశారు. ల్యాబ్ పరీక్షల నిమిత్తం అనుమానాస్పదంగా ఉన్న 25 ఆహార నమూనాలను ల్యాబ్‌లకు తరలించారు. మరోవైపు ఉల్లంఘనలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ప్రిజం హాస్పిటాలిటీ సర్వీసెస్, ఘర్ ది క్లౌడ్ కిచెన్, రెబెల్ ఫుడ్స్ సహా మరో 10 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్వల్ప లోపాలున్న మరో ఐదు సంస్థలకు తమ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలంటూ ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు అందించారు. సస్పెండైన సంస్థలను తిరిగి తనిఖీ చేసిన తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. హోటళ్ల రేటింగ్స్ చూసి మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేసుకునేటప్పుడు వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
