Sonia Gandhi: 6 దశాబ్దాల ప్రస్థానం.. ప్రపంచానికి తెలియని కథ.. సోనియా గాంధీ అంతరంగం..
ప్రపంచానికి ఆమె కాంగ్రెస్ అధినేత్రి.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన అత్యంత శక్తిమంతమైన నాయకురాలు. కానీ ఆ గంభీరమైన ముఖం వెనుక ఎవరికీ తెలియని కన్నీటి సంద్రం దాగుంది. ఇటలీలో పుట్టి, ప్రేమించిన రాజీవ్ కోసం భారతదేశ కోడలై.. వరుస మరణాల మధ్య కుటుంబ భారాన్ని ఒంటిచేత్తో మోసింది. ఎన్నో సంచలన విషయాలను తన తాజా పుస్తకం బిలాంగింగ్లో స్వయంగా బయటపెట్టారు.

ఒకప్పుడు ఆమెకు రాజకీయాలతో సంబంధమే లేదు. అధికారం మీద ఆశ లేదు. రాజకీయ వేదికలపై కనిపించాలన్న ఆలోచన కూడా లేదు. ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనే కలతో ఇటలీ నుంచి భారత్‌కు వచ్చింది. కానీ కాలం ఆమె జీవితాన్ని అనూహ్య మలుపులు తిప్పింది. అత్తను హత్య చేశారు. భర్తను బలిగొన్నారు. కుటుంబం వరుస విషాదాల్లో కూరుకుపోయింది. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న ఆమెనే. చివరకు దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలబెట్టింది. ఆమే సోనియా గాంధీ. ఆరు దశాబ్దాల జీవిత ప్రయాణంలోని ప్రేమ, కన్నీళ్లు, కుటుంబ అనుబంధాలు, రాజకీయ సంఘర్షణలను ఇప్పుడు తన మాటల్లోనే ఆవిష్కరించారు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో వెలువడిన పుస్తకం. రాజకీయ నాయకురాలిగా ప్రపంచానికి తెలిసిన సోనియాలోని వ్యక్తిగత మనిషిని పరిచయం చేస్తోంది.
ప్రేమ కోసం దేశం మారిన యువతి
సోనియా గాంధీ 1946 డిసెంబర్ 9న ఇటలీలోని వెనెటో ప్రాంతం, విసెంజా ప్రావిన్స్‌లో ఉన్న లూసియానా గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత టురిన్ సమీపంలోని ఓర్బస్సానోలో బాల్యాన్ని గడిపారు. ఓ చిన్న ఊరిలో జన్మించిన సోనియా. చదువు కోసం ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్కు వెళ్లారు. అక్కడ రాజీవ్ గాంధీతో పరిచయం. ఆ తర్వాత ప్రేమగా మారింది. 1968లో వివాహంతో భారతదేశంలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అప్పటివరకు తెలిసిన ప్రపంచం ఒకటి. పెళ్లి తర్వాత ఎదురైన ప్రపంచం మరొకటి. భాష, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు, సంస్కృతి.. అన్నింటినీ కొత్తగా అలవాటు చేసుకున్నారు. పెళ్లి సమయంలో నెహ్రూ స్వాతంత్ర్య పోరాట కాలంలో వడికిన నూలుతో తయారైన చీరను ధరించడం వంటి జ్ఞాపకాలను కూడా పంచుకున్నారు. ఇందిరాగాంధీతో అత్తాకోడళ్ల అనుబంధం, కుటుంబంలో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
మాతృత్వంలోనూ మిగిలిన మాయని గాయం
ప్రతి కుటుంబ జీవితంలోనూ కొన్ని మధుర జ్ఞాపకాలుంటాయి. మరికొన్ని చెరగని గాయాలుంటాయి. సోనియా జీవితంలోనూ అలాంటి విషాదం ఎదురైంది. 1969లో తొలి సంతానంగా జన్మించిన బిడ్డ కొద్దిసేపటికే మరణించింది. ఆ విషాదం రాజీవ్, సోనియా దంపతులను తీవ్రంగా కలచివేసింది. బిడ్డ అంత్యక్రియల సమయంలో ఎదురైన అనుభవాలను కూడా పుస్తకంలో ప్రస్తావించారు. ఆ తర్వాత రాహుల్, ప్రియాంకలతో కుటుంబ జీవితం ముందుకు సాగినా.. తొలి బిడ్డను కోల్పోయిన జ్ఞాపకం జీవితంలో ఒక బాధాకరమైన అధ్యాయంగా మిగిలింది.
ఒకే కుటుంబం – వరుస విషాదాలు
నెహ్రూ-గాంధీ కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు సోనియా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడం. 1984లో ఇందిరాగాంధీ హత్య. ఆ తర్వాత 1991లో రాజీవ్ గాంధీ హత్య. ఈ ఘటనలు కుటుంబాన్ని కుదిపేశాయి. అత్తను, భర్తను కోల్పోయిన సోనియాకు వ్యక్తిగత జీవితం ఒక్కసారిగా మారిపోయింది. భర్త మరణం తర్వాత పిల్లల భవిష్యత్తు, కుటుంబ భద్రతే ప్రధానంగా మారాయి. రాజకీయాలకు దూరంగా ఉంటూ కుటుంబానికే పరిమితం కావాలనుకున్నారు. కానీ పరిస్థితులు ఆమెను మరో దిశగా నడిపించాయి.
ఎమర్జెన్సీ నుంచి ఆపరేషన్ బ్లూస్టార్ వరకు
దేశ రాజకీయాల్లో కీలకమైన ఘట్టాలను ఓ కుటుంబ సభ్యురాలిగా దగ్గర నుంచి చూసిన అనుభవాలను కూడా పంచుకున్నారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఇందిరాగాంధీ పాలనా శైలి, రాజీవ్ రాజకీయాల పట్ల ఉన్న వైఖరిని గుర్తు చేసుకున్నారు. 1984 ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత ఇంట్లోని ఓ గదిలో గ్రెనేడ్లు కనిపించిన ఘటనను కూడా ప్రస్తావించారు. రాజకీయ నిర్ణయాలు దేశాన్ని మాత్రమే కాదు. వాటితో సంబంధం ఉన్న కుటుంబాల జీవితాలను కూడా ఎలా ప్రభావితం చేస్తాయో ఈ జ్ఞాపకాలు తెలియజేస్తున్నాయి.
రాజకీయాలకు దూరం – చివరకు నాయకత్వం
రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలన్న ప్రతిపాదనలను సోనియా తొలుత తిరస్కరించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని స్పష్టం చేశారు. అయితే పార్టీ పరిస్థితులు, నాయకుల విజ్ఞప్తులు, కాంగ్రెస్‌లో నెలకొన్న నాయకత్వ అవసరాలతో 1998లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. విదేశీ మూలాలపై విమర్శలు, రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలు, పార్టీ అంతర్గత సవాళ్ల మధ్య తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. వ్యక్తిగతంగా కోరుకున్న జీవితం ఒకటైతే, రాజకీయ పరిస్థితులు నడిపించిన జీవితం మరొకటిగా మారింది.
ప్రధాని పదవిని వద్దనుకున్న వేళ
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విజయం సాధించడంతో ప్రధాని పదవి సోనియా గాంధీని ఊరించింది. ఆమెనే ప్రధానిగా చూడాలని పార్టీ నేతలు, మిత్రపక్షాలు కోరుకున్నాయి. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ఆ పదవిని తిరస్కరించారు. ఆ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచనలు, అంతర్మథనాన్ని పుస్తకంలో వివరించారు. విదేశీ మూలాలపై సాగుతున్న రాజకీయ ప్రచారం, కుటుంబ సభ్యుల ఆందోళనలు, తన వ్యక్తిగత నిర్ణయం. ఇలా అనేక అంశాలు ఆ సమయంలో ప్రభావం చూపాయని చెప్పారు. చివరకు మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా ప్రతిపాదించారు. అధికారంలోకి వచ్చినా అత్యున్నత పదవికి దూరంగా ఉండటం ఆమె రాజకీయ జీవితంలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.
తల్లిగా ఓ ప్రపంచం – నాయకురాలిగా మరో ప్రపంచం
రాహుల్, ప్రియాంకల పెంపకం, వారి భద్రత, భవిష్యత్తుపై తల్లిగా తనకున్న ఆందోళనలను కూడా పంచుకున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు. మరోవైపు కుటుంబ బాధ్యతలు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం తన జీవితంలో ముఖ్యమైన అంశంగా నిలిచింది. రాజకీయ వేదికపై కనిపించే కఠినమైన నాయకత్వానికి, కుటుంబంలో ఉండే మానవీయ అనుబంధాలకు మధ్య ఉన్న తేడాను పుస్తకం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు.
రాజకీయాలకు అతీతంగా..
ఇప్పటివరకు సోనియా గాంధీ గురించి ఎక్కువగా చర్చించింది ఆమె రాజకీయ నిర్ణయాలు, పదవులు, అధికార సమీకరణాల గురించే. కానీ ఈ పుస్తకం వాటికి అతీతంగా ఆమె వ్యక్తిగత ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ప్రేమ కోసం దేశం మారిన యువతి. కుటుంబంలో వరుస విషాదాలను ఎదుర్కొన్న మహిళ. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుని చివరకు పార్టీ పగ్గాలు చేపట్టిన నాయకురాలు. ఇలా అనేక కోణాలు ఇందులో కనిపిస్తాయి.
కాలం మనిషి జీవితాన్ని మార్చవచ్చు. కానీ గత జ్ఞాపకాలను చెరపలేదు. పదవులు ఒక వ్యక్తి స్థాయిని పరిచయం చేస్తే. అనుభవాలు ఆ వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తాయి. సోనియా గాంధీ జీవితంలోని ఆరు దశాబ్దాల ప్రయాణం అదే చెబుతోంది. ‘బిలాంగింగ్’ రాజకీయ నాయకురాలి ఆత్మకథనానికి మించి ప్రేమ, కుటుంబం, మాతృత్వం, విషాదం, బాధ్యతల మధ్య సాగిన ఓ మహిళ అంతరంగ ప్రయాణంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కొండవీటి శివనాగరాజు
డిప్యూటీ అవుట్ ఫుట్ ఎడిటర్, టీవీ9.
