Private Hospitals Notice: కరోనా బిల్లులపై 88 హాస్పిటల్స్‌కు తెలంగాణ సర్కార్ నోటీసులు.. 48 గంటల్లో వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు
కరోనా మహమ్మారి విరుచుకుపడుతోన్న సమయంలో.. ఎవరైనా సరే తమకు ఏంటి? అన్నట్టుగా.. ప్రైవేట్ ఆస్పత్రులు వ్యవహరిస్తున్నాయి. పాజిటివ్ వస్తే చాలు, కరోనా రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి.
Telangana Govt. Show Cause Notice to Private Hospitals: కరోనా మహమ్మారి విరుచుకుపడుతోన్న సమయంలో.. ఎవరైనా సరే తమకు ఏంటి? అన్నట్టుగా.. ప్రైవేట్ ఆస్పత్రులు వ్యవహరిస్తున్నాయి. పాజిటివ్ వస్తే చాలు, కరోనా రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. కొందరు లక్షలు చదివించినా.. తమవారి ప్రాణాలు దక్కలేదని వాపోతున్నారు. పూర్తి డబ్బులు కడితే గానీ మృతదేహన్ని ఇవ్వకుండా నానా మానసిక హింసకు గురిచేస్తున్నారు. కనీసం బిల్లులు కూడా వేయకుండా.. వైట్ పేపర్లపై రాసిచ్చి డబ్బులు గుంజేస్తున్నారు చాలామంది. ఇదే క్రమంలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆక్రమాలపై నడుం బిగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్రంలో కరోనా చికిత్స అందిస్తున్న 64 ప్రైవేటు ఆస్పత్రులపై అధిక బిల్లుల వసూలుకు సంబంధించి ఇప్పటి వరకు 88 ఫిర్యాదులు వచ్చాయని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. వాటిని పరిశీలించి.. 24 గంటల నుంచి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. వారి నుంచి వచ్చే సమాధానం అనంతరం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు అందిన మొత్తం ఫిర్యాదుల్లో హైదరాబాద్‌లో 39, మేడ్చల్ జిల్లా పరిధిలో 22, రంగారెడ్డి జిల్లాలో 15, వరంగల్ అర్బన్‌లో 7, సంగారెడ్డిలో 2, మహబూబ్‌నగర్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో ఒక్కొక్కటి వచ్చాయన్నారు.
ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిపై 6, బేగంబజార్‌లోని ఆస్పత్రిపై 5, కాచిగూడలోని ఆస్పత్రిపై 3 ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు. ఇప్పటికే ఒక ఆస్పత్రి అనుమతి రద్దు చేశామని తెలిపారు. ప్రజలు ఫిర్యాదులను 9154170960 నంబరుకు వాట్సాప్ చేయాలని శ్రీనివాసరావు సూచించారు. ఆసుపత్రి బిల్లులకు సంబంధించి ఫిర్యాదులతో పాటు కోవిడ్ టీకా, పడకల గురించి 676 ఫిర్యాదులు వచ్చాయని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ చెప్పారు.
జ్వర సర్వేతో పాటు, లాక్‌డౌన్ ద్వారా రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని.. బ్లాక్‌ఫంగస్ నియంత్రణలో ఉందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల మొదటి వారంలో పాజిటివ్ రేటు 8.69 ఉండగా, తాజాగా 4కు తగ్గిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ ఈ నెల 12వ తేదీన 54 శాతం ఉండగా, ప్రస్తుతం 39 శాతానికి తగ్గిందన్నారు. రికవరీ రేటు 93గా ఉందని.. మరణాల రేటు 0.55 అని పేర్కొన్నారు. ప్రజలు మరికొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఆరోగ్య బృందాలు 6 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే చేసినట్టు తెలిపారు. కరోనా ఓపీలో 11,814 మందిలో లక్షణాలు గుర్తించారన్నారు. రాష్ట్రంలో 44 ఆస్పత్రుల్లో 278 మంది రోగులు బ్లాక్ ఫంగ్‌సకు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ముప్పు ఎక్కువ (హై రిస్క్) ఉన్న గ్రూపుల వారికి శుక్రవారం నుంచి టీకా ఇవ్వనున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. జీహెచ్‌ఎంసీకి 2.10 లక్షల టీకాలు, జిల్లాలకు 1.45 లక్షల డోస్‌లను అందించినట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీలో 30, జిల్లాల్లో రెండు, మూడు మండలాలకు ఒక పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.