Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇఫ్తార్‌ విందుతో ప్రజాధనం వృథా! కేటాయించిన రూ.70 కోట్లను రద్దు చేయాలని సీఎం రేవంత్‌కు లేఖ

రంజాన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందులకు రూ.70 కోట్లు కేటాయించడంపై కాంగ్రెస్ నేత డాక్టర్ లుబ్నా సర్వత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిధులను మైనారిటీల అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గతంలో ఇఫ్తార్ పేరిట ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇఫ్తార్‌ విందుతో ప్రజాధనం వృథా! కేటాయించిన రూ.70 కోట్లను రద్దు చేయాలని సీఎం రేవంత్‌కు లేఖ
Revanth Reddy
Follow us
Noor Mohammed Shaik

| Edited By: SN Pasha

Updated on: Mar 13, 2025 | 6:21 PM

రంజాన్ మాసం మొదలైపోయింది. ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైన ఈ సమయంలో ప్రార్థనలు, నమాజులు సర్వ సాధారణం. దానితో పాటు ముస్లింలంతా ఒక చోట చేరి ఇఫ్తార్ విందులు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వాలు కూడా అధికారికంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే తాజాగా ఈ ఇఫ్తార్ విందును రద్దు చేయాలని కోరుతో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే లేఖ వెళ్లింది. రంజాన్ పవిత్ర మాసం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇఫ్తార్ ఏర్పాటుకు గాను అక్షరాలా రూ.70 కోట్లు మంజూరు చేసింది.

ఇఫ్తార్, దావత్ పేరుతో రూ.70 కోట్ల ప్రజా సంక్షేమ నిధులను దుబారా చేయవద్దంటూ కాంగ్రెస్ సభ్యురాలు, సామాజిక, పర్యావరణ కార్యకర్త డాక్టర్ లుబ్నా సర్వత్ లేఖ ద్వారా కోరారు. అవినీతిపరమైన మునుపటి బీఆర్ఎస్ పాలన పద్ధతిని అనుసరించడం ఆపాలని ఆమె కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఇఫ్తార్ విందుల పేరిట కోట్ల ప్రజాధనం వృధా జరిగిందని, ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగించవద్దంటూ సీఎం రేవంత్ తో పాటు మంత్రి షబ్బీర్ అలీ, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిలకు విన్నవిస్తూ ఆమె లేఖలో కోరారు. అదే ప్రజాధనాన్ని తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్, ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ మైనారిటీస్ కు కేటాయించినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె అన్నారు.

అదే లేఖలో ప్రస్తావిస్తూ.. మీరు దేశంలోనే ఒక ప్రత్యేకత కలిగిన ముఖ్యమంత్రి అని కొనియాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి సలహాలు, విమర్శలను పదేపదే కోరుతూ మన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను దేశంలోనే ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. అంతేకాకుండా.. ఇఫ్తార్ అంటే ఏంటి..? ఎందుకు చేస్తారు..? లాంటి విషయాలపై కూడా వివరణ ఇచ్చారు. దయచేసి ఈ లేఖని పరిగణనలోకి తీసుకుని, అందులో పొందుపరిచిన విషయాలపై సమగ్ర విచారణ చేసి ఇఫ్తార్ విందుకు కేటాయించిన నిధులను రాష్ట్రంలో అవసరమైన కార్యక్రమాలకు వినియోగించాలని లుబ్నా సర్వత్ లేఖ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.